ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం ఏదైనా ఉందంటే.. అది మంత్రివర్గ విస్తరణే. తొలి కేబినెట్లో చోటు దక్కించుకోలేకపోయిన వారంతా.. రెండో విస్తరణ కోసం కళ్లలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. రాజకీయంగా విపక్షాలు కూడా ఆసక్తిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వంపై సాంకేతికంగా పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కేబినెట్ విస్తరణతో ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని, దాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు చాలా మంది.
ఈ నేపథ్యంలో జగన్ మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే విస్తరణ చేపట్టబోతున్నారు. అయితే.. ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నది వాస్తవం. నిజానికి తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే బెర్త్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. అయితే.. మొదటి మంత్రివర్గం రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుందని చెప్పడంతో.. రెండో దఫా తమకు చోటు లభిస్తుందిలే అని సర్దిచెప్పుకున్నారు.
ఇప్పుడు చోటుకోసం గట్టి పట్టే పడుతున్నారు. ఎందుకంటే.. ఇది ఎన్నికల కేబినెట్. మరోసారి విస్తరణ చేపట్టే అవకాశం లేదు. ఎన్నికల వరకు ఇదే మంత్రివర్గం కొనసాగుతుంది. కాబట్టి.. ఈసారి ఎలాగైనా చోటు దక్కించుకోవాలని చూస్తున్నారు ఆశావహులు. ఇటు జగన్ కూడా సాధ్యమైనంత మందికి చోటు కల్పించాలని చూస్తున్నారని తెలుస్తోంది. తద్వారా.. అసంతృప్తిని నివారించడంతోపాటు మిగిలిన వారికీ ఛాన్స్ ఇచ్చామని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ఇందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. ప్రస్తుత మంత్రివర్గంలోని 95 శాతం మందిని తప్పిస్తారని తెలుస్తోంది. అనివార్యం అనుకున్నవారిని మాత్రమే కొనసాగిస్తారని, మిగిలిన వారందరినీ తొలగిస్తారని టాక్. అయితే.. పనితీరు బాగోలేదని, మరొకటని చెప్పడం కాకుండా.. కారణమేంటో చెప్పి, జగన్ వారితో నేరుగా మాట్లాడి పక్కన పెడతారట. మిగిలిన వారికీ అవకాశం ఇవ్వాలనే ఏకైక కారణంతో పక్కన పెడుతున్నామని, మరో విధంగా భావించొద్దని జగన్ వారితో చెప్పనున్నారట.
ఈ విధంగా.. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నవారికి అసలు విషయం చెప్పి ఉద్వాసన పలుకుతారట. ఆ తర్వాత వీరికి పార్టీ పదవులు కట్టబెడతారని సమాచారం. నిరుత్సాహానికి గురికాకుండా.. జిల్లాల ఇన్ ఛార్జులుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, పదవి దక్కలేని వారికి ఏ కారణం వల్ల ఇవ్వలేకపోయారో చెప్పి, బుజ్జగిస్తారట. మరి, ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది చూడాలి.