Amit Shah Meeting With Ramoji Rao: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు విపక్షాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏపీ కంటే తెలంగాణలో భిన్న రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలే యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, మజ్లీస్ ఉండగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకపోగా..కమలం పార్టీ మాత్రం పొత్తులతో పర్వాలేదనిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు బీజేపీ దోస్తీకి ప్రయత్నిస్తునే ఉన్నారు. అయితే గత మూడేళ్లుగా ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ ఇటీవల మాత్రం ఆయనకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. దీంతో మరింత దూకుడు ప్రదర్శించి బీజేపీతో కలిసిపోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు రామోజీరావు మధ్యవర్తిత్వం వహించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు జాతీయ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి.

పొత్తు కుదుర్చుకోవాలని..
తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అంది వచ్చిన ఏ అవకాశాలను విడిచిపెట్టడం లేదు. ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలన్న కసితో బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి రూట్ క్లీయర్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు. అయితే తెలంగాణలో గెలవడానికి ఈ బలం చాలదని అధిష్టానం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావాలని భావిస్తోంది. అందుకే బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. నిన్నటి మనుగోడు బహిరంగ సభ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రముఖులతో భేటీ అయ్యారు. అనూహ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి మరీ రామోజీరావును కలిశారు. అయితే ఈ భేటీ వెనుక పెద్ద కథ నడిచినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకానొక దశలో చంద్రబాబు సైతం ఈ భేటీకి హాజరవుతున్నారని ప్రచారం నడిచింది. అయితే ఈ భేటీపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీకి ఉభయతారకంగా కలిగే కొన్ని ప్రయోజనాలు, కలిసి పనిచేస్తే ఉండే లాభాలు వంటి వాటి గురించి రామోజీరావు అమిత్ షాకు వివరించినట్టు తెలుస్తోంది.
టీడీపీని దగ్గర చేసేందుకు..
తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావం చూపగల స్థితిలో ఉన్నారు. కమ్మ ప్రముఖులు కూడా ఎక్కువగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నారు. వీరంతా బీజేపీ గూటికి చేరాలంటే చంద్రబాబును దగ్గర చేసుకుంటే మేలని రామోజీరావు అమిత్ షాకు సూచించినట్టు తెలిసింది. ఇటీవల టీఆర్ఎస్ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం అదేనని చెప్పుకొచ్చినట్టు సమాచారం. అందుకే చంద్రబాబును దగ్గర చేసుకోవడం ద్వారా అటు సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించుకునే అవకాశముందని రామోజీరావు వివరించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో టీడీపీకి సహకరించాలన్నది ఆయన సూచన. ఏపీలో వీలైనన్ని లోక్ సభ స్థానాలను ఎక్కువ గా తీసుకోవడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూరనుందని రామోజీ చెప్పినట్టు సమాచారం.
కేసీఆర్ ఓటమికి రూట్ మ్యాప్..
అయితే వీరిద్ధరి భేటీలో తెలంగాణా రాజకీయాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించాలంటే అనుసరించాల్సిన వ్యూహమేమిటి? ఏయే వర్గాలను దగ్గర తీసుకోవాలి? ఏ పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లాలి? అన్నది అమిత్ షా రామోజీరావును కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అందుకు సంబంధించి తయారుచేసుకున్న రూట్ మ్యాప్ ను సైతం రామోజీరావు అమిత్ షాకు ఇచ్చినట్టు సమాచారం. నాటి తెలంగాణ ఉద్యమ పరిస్థితులు, ప్రభుత్వం ప్రతికూలంశాలు, విపక్షాల్లో ఉన్న అనైక్యత, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు వంటి వాటి కోసం సమగ్రంగా చర్చించిన తరువాత బీజేపీ అనుసరించాల్సిన అంశాల గురించి రామోజీరావు కొన్ని సూచనలు చేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ చర్చలో ఎక్కువగా టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు రామోజీరావు ఆసక్తిచూపినట్టు సమాచారం.