Delhi delivery Boy: మంచితనానికి మించిన ఆస్తి లేదు.. ఇది అనేకసార్లు రుజువైంది. అయినా ఇప్పటికీ చాలా మంది సంపాదనే ఆస్తిగా భావిస్తున్నారు. ఉన్నంతకాలం అనుభవించాలి.. తర్వాతి తరాలకు కూడా లోటు ఉండకూడాదు అన్నట్లుగా సంపాదనకు ఎగబడుతున్నారు. అయితే చివరకు ఈ సంపాదన వెంటరాదు. మనిషి వెంట వచ్చేది మంచితనమే. మంచితనం అంటే అప్పులు చేసి సాయం చేయడం కాదు.. చిన్న మాటసాయం చేసినా మంచితనమే ఉన్నంతలో దానం చేయడం మంచితనమే. ఇందుకు తాజాగా ఉదాహరణ ఢిల్లీకి చెందిన డెలివరీబాయ్ అకాశ్ సరోజ్.
పేదల ఆకలి తీరుస్తూ..
డాన్సర్ అయిన ఆకాశ్ ఉపాధి కోసం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన సంపాదన సగాన్ని పేదల ఆకలి తీర్చడానికి వాడుతున్నాడు. రోడ్లపై నిరాశ్రయులకు భోజనం, దుప్పట్లు పంచిపెట్టే అతని దాదృత్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత సంపద ఉన్నా పిల్లికి బిచ్చం వేయడానికి వెనుకాడే రోజులు ఉన్న ఈ సమాజంలో అతి సాధారణ జీవితంలో మహా మనసును చూపుతున్నాడు.
తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి..
ఆకాశ్ తండ్రి చనిపోయాడు. తన తండ్రి కోరికను పూర్తి చేస్తూ రోడ్ల మీద పడుకునే వారికి రోజూ భోజనం అందిస్తున్నాడు. తన డాన్స్ ప్రతిభతోపాటు సేవా మనసును కలిపి పేదలకు మద్దతుగా నిలబడ్డాడు. ఈ చిన్న చర్యలు సమాజంలో మానవత్వ విలువలను పునరుద్ధరిస్తున్నాయి.
వైరల్ వీడియోలు..
ఆకాశ్ చేసిన సేవల వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. వేల వ్యూస్, లైక్స్, షేర్స్ సాధిస్తున్నాయి. నెటిజన్లు ఆకాశ్ మనస్తత్వాన్ని ప్రశంసిస్తూ ‘అసలైన ధనవంతుడు‘ అని పిలుస్తున్నారు. మనసున్న మహారాజుగా అభివర్ణిస్తున్నారు. దాతృత్వం ఇతరుల్లో సేవా భావాన్ని రేకెత్తిస్తోంది.