Visakhapatnam Steel Plant: ఏపీ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అటు విభజన సమస్యలతో పాటు విశాఖ నగరాన్ని గ్రోత్ హబ్ సిటీ జాబితాలో చేర్చింది. రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సైతం పక్కన పెట్టింది. దీంతో ఏపీ విషయంలో కేంద్రం సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముంగిట ఈ సానుకూల నిర్ణయాలు రావడం శుభపరిణామం. అయితే అన్నింటికీ మించి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం నుంచి వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నిర్ణయానికి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం రగులుతూనే ఉంది. అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చాయి. ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రైవేటీకరణ నిర్ణయం పై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాడుతూ వచ్చారు. ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపట్టారు. అయితే ఎన్నికల ముంగిట కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఏ ఒక్కరికీ తలోగ్గి తీసుకున్న నిర్ణయం కాదు.
విశాఖ కేంద్రంగా రాజకీయం చేయాలనుకుంటున్న బిజెపి కీలక నేత జివిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటీకరణ అనేది ఇప్పట్లో జరగదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ప్రకటించారు. యధాస్థితిని కొనసాగించేలా కేంద్రం నుంచి సంకేతాలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ పరిశ్రమ అమ్మకం దాదాపు నిలిచిపోయినట్టేనని.. అయితే సంస్థను లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత ఉందని.. అప్పుడే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా చిరకాలం కొనసాగగలదని జివిఎల్ ప్రకటించడం విశేషం. మొత్తానికైతే ఎన్నికల ముంగిట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టడం రాజకీయ స్టంట్ గా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా ప్రత్యేక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.