Telangana Elections 2023: ఓటు కోసం ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తో..

హైదరాబాదులోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అటువంటి వ్యక్తి ఎలాగైనా ఓటు వేయాలని భావించారు.

Written By: Dharma, Updated On : November 30, 2023 4:40 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటుతోనే చక్కని పాలకుడు, ప్రభుత్వాన్ని ఎంచుకోగలం. ఓటు విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తేనే చక్కటి సమాజం నిర్మించుకోగలం. అయితే ఓటు విషయంలో ప్రజల అభిప్రాయం మారుతుండడం విశేషం. తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో ఓటు చైతన్యం వెల్లివిరుస్తోంది. పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు సైతం తీరిక చేసుకుని ఓటు వేయడం కనిపించింది. చివరకు అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం ఓటు వేయడానికి రావడం అభినందనీయం.

హైదరాబాదులోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అటువంటి వ్యక్తి ఎలాగైనా ఓటు వేయాలని భావించారు. ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. గచ్చిబౌలిలోని జిపిఆర్ఎస్ లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1966 నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో తాను ఓటు వేసినట్లు చెబుతున్నారు.

అలాగే ముషీరాబాద్ గాంధీ నగర్ లోని ఎస్బిఐ కాలనీకి చెందిన లక్ష్మీ అనే మహిళ ఆస్తమాతో బాధపడుతున్నారు. చిన్నపాటి చలిగాలులకు ఆమె ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓటు వేయాలన్న కృతనిత్యంతో ఘంటసాల గ్రౌండ్ లోని 83 వార్డ్ నెంబర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. మరో ఏడాదిలో 100వ పడిలో పడనున్న విద్యావేత్త చుక్క రామయ్య రెండు చక్రాల చైర్ లో, సహాయకుడితో వచ్చి మరి ఓటు వేయడం విశేషం. అయితే గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో ఈ స్థాయిలో ఓటు చైతన్యం కనిపించలేదు. కానీ తొలిసారిగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం ముందుకు వచ్చి ఓటు వేయడం విశేషం. ఇది ప్రభుత్వ వ్యతిరేకమా? అనుకూలమా? అన్నది ఫలితాల్లో తేలనుంది.