Chandrababu: చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో 2003 అక్టోబర్ 1న చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలో అలిపిరి ఘాట్ వద్ద మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే తాజాగా ఈ కేసులో నిందితులు నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. నేరం జరిగింది గానీ.. నేరారోపణ రుజువు కాకపోవడంతో ఓ ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చడం విశేషం.
అప్పట్లో ఈ కేసులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి, అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ, పాండురంగారెడ్డి అలియాస్ సాగర్, హరగోపాల్ అలియాస్ రామకృష్ణ తో పాటు 35 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసు 11 ఏళ్ల పాటు విచారణ జరిగింది. రామ్మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, మాల చంద్రులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. నాలుగేళ్ల పాటు శిక్ష. రూ.500 జరిమానా విధించింది. రెండో ఛార్జ్ షీట్లోని ముగ్గురిని దోషులుగా కోర్టు తేల్చింది.
కాగా తాజాగా తిరుపతి జిల్లా కోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది. ఆ ముగ్గురు దోషులు తిరుపతి జిల్లా కోర్టులో సవాల్ చేశారు. కేసు విచారించిన తిరుపతి నాలుగవ అదనపు జిల్లా న్యాయస్థానం ఇన్చార్జి న్యాయాధికారి అన్వర్ బాషా తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ నక్సలైట్లు రామ మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, చంద్రలను నిర్దోషులుగా తేల్చారు. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులు కాగా.. ఎప్పటికీ 15 మంది మరణించారు. వీరిలో అత్యధికులు నక్సలైట్లు. దాదాపు అందరూ ఎన్ కౌంటర్లోనే చనిపోయారు. ఆరుగురిపై కేసు కొట్టి వేయగా.. శిక్ష పడిన ఇద్దరూ హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లారు. మరో 10 మంది నిందితులను పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేయలేకపోయారు. అక్కడ నేరం జరిగింది కానీ.. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కోర్టుల్లో ఉపశమనం దక్కడం విశేషం.