Love Today Crime : చిన్న సినిమాగా విడుదలై అతిపెద్ద విజయం సాధించింది లవ్ టుడే. సమకాలీన టాపిక్ ని స్టోరీ లైన్ గా ఎంచుకొని అద్భుతంగా తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్. లవ్, ఎమోషన్, హ్యూమర్ చక్కగా పండటంతో పాటు సబ్జెక్టు యూత్ కి ఫుల్ గా కనెక్ట్ అయ్యింది. దీంతో యువకులతో సినిమా థియేటర్స్ నిండిపోయాయి. లవ్ టుడే చిత్రంలో ప్రదీప్ నటించి, దర్శకత్వం వహించారు. భారీ వసూళ్లు రాబట్టిన లవ్ టుడే నిర్మాతల జేబులు నింపింది. తెలుగులో కూడా ఈ సినిమాకు ఆదరణ దక్కింది. ప్రదీప్ నటన, దర్శకత్వ ప్రతిభకు మార్కులు పడ్డాయి.

లవ్ టుడే మూవీలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ లవ్ లో పడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న మొబైల్ విషయంలో ఈ జంట ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. 24 గంటలు ఒకరి మొబైల్ మరొకరు మార్చుకోవాలని డిసైడ్ అవుతారు. ఆ విధంగా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి గురించి కొన్ని చేదు నిజాలు బయటపడతాయి. దాంతో గొడవలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. చివరికి ఒక్కటై కథ సుఖాంతం చేస్తారు.
ఈ స్కీమ్ రియల్ లైఫ్ లో ట్రై చేసి ఓ యువకుడు అడ్డంగా బుక్ అయ్యాడు. అనూహ్యంగా జైలు పాలయ్యాడు. తమిళనాడుకు చెందిన అరవింద్ అనే యువకుడు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సొంత ఊరికి చెందిన అమ్మాయితో అరవింద్ కి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని కొంచెం క్లోజ్ అయ్యారు. ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలవడం చేస్తున్నారు. ఈ క్రమంలో చనువు పెరిగి లవ్ టుడే మూవీ కాన్సెప్ట్ ట్రై చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకరి మొబైల్ మరొకరు మార్చుకున్నారు.
కాగా అరవింద్ తన మొబైల్ లోని వ్యక్తిగత డేటా డిలీట్ చేయకుండా కాబోయే భార్యకు ఇచ్చేశాడు. ఇంటికెళ్లి మొబైల్ చెక్ చేసిన యువతి షాక్ కి గురైంది. అందులో ఓ బాలిక ప్రైవేట్ వీడియో ఉంది. ఆ విషయం వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అరవింద్ మీద ఫిర్యాదు చేశారు. దాంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అరవింద్ జైలు పాలయ్యాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు వీడియోలో ఉన్న బాలిక పేరెంట్స్ ని కలిసి విషయం చెప్పి జాగ్రత్తలు చెప్పారట. అలా లవ్ టుడే స్టోరీ రియల్ లైఫ్ లో ఊహించని విధంగా ముగిసింది.