TDP Janasena Alliance: ఏపీలో విపక్షాల బలం పెంచిన 2023

ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య పొత్తు చిగురించింది ఈ ఏడాదిలోనే. ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది. ఎన్నికల ముంగిట పొత్తు పెట్టుకోవాలని ఆ రెండు పార్టీలు భావించాయి.

Written By: Dharma, Updated On : December 9, 2023 12:27 pm

TDP Janasena Alliance

Follow us on

TDP Janasena Alliance: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో మూడు నెలల వ్యవధిలో ఎన్నికల సమర శంఖారావం మోగనుంది. అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. గెలుపే ధ్యేయంగా వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే ఈ ఏడాది రాజకీయంగా విపక్షాలకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే విపక్షాలు బలపడ్డాయి. వైసీపీకి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగా.. మూడేళ్ల పాటు.. అంటే మూడేళ్లు అధికార వైసిపికి ఎదురులేకుండా పోయింది. 2023 మాత్రం ప్రతికూలతను చూపింది.

ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య పొత్తు చిగురించింది ఈ ఏడాదిలోనే. ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది. ఎన్నికల ముంగిట పొత్తు పెట్టుకోవాలని ఆ రెండు పార్టీలు భావించాయి. కానీ అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సీన్ మారింది. నేరుగా చంద్రబాబును జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే పొత్తు నిర్ణయాన్ని.. కాస్త ముందుకు జరిపారు అన్నమాట.

వాస్తవానికి బిజెపితో జనసేన పొత్తును మూడేళ్ల కిందటే పవన్ ప్రకటించారు. ఇరుపక్షాలు సంయుక్తంగా ముందుకెళదామని నిర్ణయం తీసుకున్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా సంయుక్తంగా వెళ్లిన దాఖలాలు లేవు.ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం.. ఆ రెండు పార్టీల మధ్య ఎటువంటి సర్దుబాటు లేదు. పొత్తులతో ముందుకెళ్లలేదు. 2023లో సైతం ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రమే. కానీ తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి వెళ్లడం విశేషం. అయితే బిజెపి ఏపీలో జనసేన తో కలిసి నడుస్తుందా? లేదా? అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది.

2014 ఫార్ములాను రిపీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. టిడిపి, బిజెపి, జనసేన సంయుక్తంగా ముందుకెళ్లాలన్నదే పవన్ భావన. కానీ బిజెపి ఆ ప్రతిపాదన పై ఎటువంటి సంకేతాలు వెల్లడించడం లేదు. ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత లేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.