Visakhapatnam Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమం మరో స్ఫూర్తి దిశగా ముందుకు సాగుతోంది. బలిదానాలు, వేలాదిమంది త్యాగధనుల కృషి ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యింది. అటువంటి పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం నేటితో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో అడ్డంకులు.. ఇవేవీ ఉక్కు సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. పైగా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమ ప్రణాళికలు మరింత రాటు తేలాయి.
ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మిక శక్తి పిడికిలి బిగించి వెయ్యి రోజులవుతోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన పోరాటం నిరవధికంగా కొనసాగుతోంది. కార్మికులు, ఉద్యోగుల పోరాటాలకు ప్రజలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. ఉక్కు ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ కు ఉద్యమ కమిటీలు పిలుపునిచ్చాయి.
2021 ఫిబ్రవరి 12 నుంచి ఐక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి దీక్షలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ కోసం చేసిన రుణాలు వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తయని, ఐరన్ వోర్ గనులు కేటాయిస్తే సమస్యను అధిగమిస్తామని కార్మికులు ఉద్యోగులు చెబుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ వచ్చాయి. ఇప్పటికే లక్షలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ చిత్తశుద్ధిగా చెప్పలేకపోతున్నారు. కానీ కడపలో పెట్టే స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. సీఎం ఇతర పార్టీలను కలుపుకొని ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని కార్మిక సంఘాలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నాయి. కానీ సీఎం జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకేనే ఉద్యమం తోనే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని ప్రజాసంఘాలు సంకల్పించాయి. అందులో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.