
ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి రాజధానిని తరలించవద్దని ఆ ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతుంటే.. జనసేన పార్టీ రాజధాని ఆందోళనకు దూరంగా వుండాలని నిర్ణయించింది. శనివారం మంగళగిరిలో భేటీ అయిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఇప్పటికిప్పుడు ఆందోళన చేయడం వల్ల ఉపయోగం లేదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశంలో రాజధాని అంశంతోపాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అంశంపై సమాలోచనలు జరిపారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు స్ఠానిక సంస్థల ఎన్నికల్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు.
మరికొందరు నేతలు ఇప్పటికే టీడీపీతో జనసేనను అంటగట్టి వైసీపీ ప్రచారం చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోను జతకడితే ఇక రెండు పార్టీలు ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోతుందని అభిప్రాయపడ్డారు. అలాంటి సంకేతాలు వెళ్ళడం దీర్ఘకాలంలో మంచిది కాదని వారు పవన్ కల్యాణ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. చాలా సేపు చర్చ తర్వాత పొత్తుల నిర్ణయం అధినేత పవన్ కల్యాణ్‌కే వదిలేసినట్లు తెలుస్తోంది.
కాగా కీలకమైన రాజధాని అంశంపై కూడా జనసేన సమావేశంలో లోతుగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజధానిపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాకే కార్యాచరణ రూపొందించాలని పవన్ నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండా రోడ్డెక్కడం వలన ఉపయోగం లేదని, ప్రభుత్వ ప్రకటన తర్వాతనే ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిద్దామని పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పటికిప్పుడు రాజధాని అంశంపై ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పవన్ కల్యాణ్ పార్టీ వర్గాలు పంపినట్లయ్యింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన జనసేనాని.. అక్కడి నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఢిల్లీకి వెళ్లారు. జనసేనాని ఉన్నట్టుండి హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఈ టూర్‌పై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.