
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కలపర్రు టోలు గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఈ.ఎస్.ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ ప్లాజా వద్ద అచ్చెన్నాయుణ్ని తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ని అదుపులోకి తీసుకునే క్రమంలో టిడిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చింతమనేని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను టోల్ ప్లాజా సమీపం నుంచి వెళ్లగొట్టారు.