
కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జాయింట్ డైరెక్టరు (జెడి)గా ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. మనోజ్ 1994 గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి. ఆయన ఐదేళ్ల పాటు సిబిఐలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సిఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి మీద నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే..
ఆ లేఖలో ఏముందంటే…
‘ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలి’ అని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.