Online Food Delivery : ఒకే దేశం.. ఒకే పన్ను విధానం అంటూ పట్టుకొచ్చిన జీఎస్టీ(GST) ద్వారా.. నరేంద్ర మోడీ సర్కారు(Prime minister Narendra Modi Govt) భారీగా జనాల జేబులు ఖాళీ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. తిండి మీద కూడా ఒకటి కాదు.. డబుల్ జీఎస్టీ వేస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్ లైన్ లో ఫుడ్ (online Food) ఆర్డర్ చేసేవారికి ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతీ వస్తువుకు జీఎస్టీ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా.. రెస్టారెంట్లు తయారు చేసే ఆహార పదార్థాలపైనా జీఎస్టీ విధిస్తున్నారు. రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసినవారు.. తిన్నందుకు రెస్టారెంట్ కు డబ్బులు చెల్లించడంతోపాటు జీఎస్టీని కూడా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే కూడా మరో జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం.
వాస్తవానికి ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ సంస్థలకు ఎక్కడా హోటళ్లు లేవు. కస్టమర్ ఏ హోటల్ నుంచి ఫుడ్ తేవాలని ఆర్డర్ చేస్తే.. అక్కడకు వెళ్లి, ఆ ఫుడ్ తెచ్చి ఇవ్వడమే ఈ సంస్థల పని. ఈ పని చేసినందుకు కొంత కమీషన్ తీసుకుంటాయి. అయితే.. ఇక్కడే కస్టమర్ జీఎస్టీని చెల్లిస్తాడు. హోటల్ కు చెల్లించాల్సిన బిల్లులోనే జీఎస్టీ కలిపి ఉంటుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ సంస్థలపైనా మరోసారి జీఎస్టీ తగిలించాలని నిర్ణయించింది మోడీ సర్కారు.
అంటే.. ఇక నుంచి ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీ చేసిన కస్టమర్.. రెండు సార్లు జీఎస్టీ చెల్లించాలన్నమాట. ఒక జీఎస్టీ హోటల్ బిల్లు వసూలు చేస్తే.. ఇంకో బిల్లు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు వసూలు చేస్తాయన్నమాట. ఈ సంస్థలపై 5 శాతం జీఎస్టీ విధించింది కేంద్రం.
నిజానికి ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు.. దానిపై ఎన్ని పన్నులు చెల్లిస్తున్నారో వినియోగదారులకు తెలియదు. ఇప్పుడైతే ఒక్క జీఎస్టీని మాత్రమే చెల్లిస్తున్నామని అనుకుంటారు. కానీ.. వాస్తవం వేరే. ఆ కొనుగోలు చేసిన వస్తువు తయారు చేయడానికి ఏయే సరుకులు అవసరమవుతాయో.. వాటన్నింటిపైనా పన్ను ఉంటుంది. ఆ తర్వాత తయారీ దారుకూ పన్ను చెల్లించాల్సి. అనంతరం ప్రాసెసింగ్ చేసిన వస్తువులపైనా పన్ను ఉంటుంది. ఆ తర్వాత జీఎస్టీ చెల్లించాలి. ఇన్ని చెల్లిస్తున్నా సరిపోనట్టుగా.. ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీపైనా జీఎస్టీ విధించింది మోడీ సర్కారు.