Sleep Deprivation Effects: మనిషి ఆరోగ్యానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మెదడు పనితీరును సక్రమంగా ఉంచడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి కారణాలతో చాలామంది సరిపడా నిద్రపోవడం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక రాత్రి నిద్ర లేకపోవడమే శరీరంపై ప్రభావం చూపుతుంది. అదే వరుసగా మూడు రోజుల పాటు నిద్ర లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆ సమస్యలు ఏంటంటే?
24 గంటలు నిద్ర లేకపోతే…
ఒక్కరోజు నిద్ర లేకుండా గడిపితే ముందుగా మెదడు పనితీరు మందగించడం ప్రారంభమవుతుంది. కళ్లలో మంట, ఎర్రబడటం, తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏకాగ్రత తగ్గిపోవడంతో పనుల్లో పొరపాట్లు జరిగే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది.
48 గంటలు నిద్ర లేకపోతే…
రెండు రోజుల పాటు నిద్ర లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, శరీరంలో బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు స్పందించే వేగం తగ్గిపోవడంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. కొందరిలో జ్ఞాపకశక్తి తాత్కాలికంగా తగ్గడం, మాట్లాడేటప్పుడు తడబడటం వంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ దశలో శరీరం తీవ్ర అలసటకు గురై శక్తిని కోల్పోతుంది.
72 గంటలు నిద్ర లేకపోతే…
మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉంటే శరీరం అత్యంత ప్రమాదకర స్థితిలోకి చేరుతుంది. తీవ్రమైన నీరసం, మానసిక గందరగోళం, దృష్టి లోపాలు ఏర్పడవచ్చు. కొందరిలో లేనివి కనిపించడం లేదా వినిపించడం వంటి భ్రాంతులు కూడా కలగొచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో గుండెపై అధిక ఒత్తిడి పడటంతో గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు కూడా తీవ్రంగానే…
నిద్రలేమి తరచూ కొనసాగితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు వచ్చి అధికంగా తినే అలవాటు ఏర్పడుతుంది. దీంతో బరువు పెరగడం సులభమవుతుంది. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
రోజుకు ఎంత నిద్ర అవసరం?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం పెద్దలు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవాలి. పిల్లలు, యువతకు ఇంకా ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, కాఫీన్ పానీయాలను పరిమితం చేయడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.
