
Heart Attacks: నెట్ విప్లవం వచ్చాక.. చాలామంది గంటల కొద్దీ సమయం మొబైల్, టీవీ స్ర్కీన్ల ముందే గడిపేస్తున్నారు. అర్ధరాత్రి దాటి.. తెల్లవారుజాము దాకా ఫోన్, టీవీ చూస్తూ ఉండిపోతున్నారు. దీనివల్ల హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. మెదడుకు విశ్రాంతి లభించకడంతో తెలియకుండానే గుండెపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ అలవాట్లు ఉన్నవారు చిన్న వయస్సులోనే హృద్రోగాల బారిన పడే ముప్పు ఉంటుంది. ఇలాంటి వారు ప్రమాదం అంచున ఉన్నట్టే. పడుకునే వేళలో పనిచేయడం, పనిచేసే సమయాల్లో పడుకోవడం వంటి జీవనశైలి వల్ల గుండె పనితీరు కూడా మారుతోంది.. జీవన చక్రానికి వ్యతిరేకంగా పని సమయాలు ఉండడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఫలితంగా శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటోంది.
కుటుంబంలో ఎవరికైనా ఉంటే…
కుటుంబంలో ఎవరికైనా హృద్రోగాలు ఉంటే.. వారి పిల్లలకు కూడా త్వరగా వచ్చే అవకాశాలుంటాయి. చాలా మంది ధూమపానం, జంక్‌ఫుడ్ వంటివాటికి అలవాటుపడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆహారం తీసుకుంటున్నారు. నిద్ర సమయాలు తగ్గాయి. పనిలో టార్గెట్ల వల్ల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. వ్యాయామం చేయట్లేదు. కూర్చుని పనిచేయడం వల్ల అధిక బరువు, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి.. 30 ఏళ్లు దాటినవారు తొలుత బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో ఏవైనా తేడాలు ఉంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. ధ్యానం చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సీటీ యాంజియోగ్రామ్ పరీక్ష తప్పని సరి
టీఎంటీ (ట్రెడ్‌మిల్ టెస్ట్), 2డీ ఎకో, లిపిడ్ ప్రోఫైల్, ఈసీజీ పరీక్షల వల్ల 50 శాతం మేరకు గుండె సమస్యలను ముందే గుర్తించవచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్లున్నవారు, బీపీ బాధితులు..35 ఏళ్ల వయస్సులోనే సీటీ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. అందులో అంతా సజావుగా ఉన్నట్టు తేలితే.. వారికి కనీసం ఏడేళ్ల దాకా హృద్రోగాలు వచ్చే ముప్పు 99 శాతం ఉండదు. పిల్లలకు తల్లిదండ్రులు మంచి జీన్స్ ఇవ్వాలి. అందుకు ముందుగా తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రోజూ కనీసం రెండు వేర్వేరు రకాల పండ్లు తినాలి. తప్పనిసరిగా ఒక కప్పు సలాడ్ తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారం 15 నిమిషాల్లో తింటే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఆలస్యమైతే పోషకాలు తగ్గిపోతాయి. మాంసాహార, స్పైసీ వంటకాలను మధ్యాహ్నానికి, కొంతమేరకు పరిమితం చేయాలి. రాత్రి పూట చపాతిలతోనే సరిపెట్టాలి. రాత్రిపూట స్పైసీ ఆహారం ఎక్కువగా తీసుకుంటే గుండె నొప్పి వచ్చే ముప్పు ఎక్కువ శాతం ఉంటుంది. కుదిరితే రోజూ నడక, పరుగు, చెమటలు పట్టేలా వ్యాయాయం చేయాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.