Summer Tips: సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే మంటలు మండిస్తున్నాడు. మధ్యాహ్నమైతే మరింత రెచ్చిపోతున్నాడు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండటం లేదు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు పోతుంది కాబట్టి వెంటనే నిస్సత్తువకు గురవుతుంది. అలా గురికాకుండా ఉండాలంటే తక్షణం శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగని ఏవి పడితే అవి తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకీ ఎండాకాలంలో తీసుకోకూడని పదార్థాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మసాలా పదార్థాలు
ఎండాకాలంలో మసాలా పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. బయటి ఉష్ణోగ్రతలకు శరీరంలో వేడిమి తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమయంలో మసాలా బాగా ఉన్న పదార్థాలు తీసుకుంటే శరీరంలో అవి మరింత వేడిని పెంచుతాయి. ఆ సమయంలో నీటి శాతం తగ్గుతుంది. అది అంతిమంగా జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మసాలా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వేసవిలో మసాలా పదార్థాలు తిన్న వారిలో కడుపులో మంట, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. 2017లో జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ఓ కథనం ప్రచురితమైంది. దాని ప్రకారం ఎండాకాలం మసాలా వస్తువులు అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు అధికంగా వస్తాయని వైద్యులు పేర్కొన్నారు.
ప్రాసెస్ వస్తువులు
మసాలా వస్తువులు మాత్రమే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎండాకాలం తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పోషకాలు తక్కువగా ఉంటాయి. పైగా వాటిలో సోడియం అధికంగా ఉంటుంది. సోడియం అధిక దాహాన్ని కలిగిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని పెంచుతుంది. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
వేయించిన పదార్థాలు
వేయించిన పదార్థాలకు ఎండాకాలంలో దూరంగా ఉండాలి. వేయించిన పదార్థాలలో లవణాలు, మసాలాలు అధికంగా ఉంటాయి. ఇవి ఉదరంలోని మృదుత్వాన్ని దెబ్బతీస్తాయి. పైగా తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వవు. అంతేకాకుండా మొటిమల వంటి సమస్యలను కలిగిస్తాయి.
కాఫీ
సమ్మర్ లో చాలామంది కాఫీ తాగుతుంటారు. ఇందులో ఉన్న కెఫెన్ బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు శరీరంలో నీటి స్థాయిలు తగ్గుతాయి. అంతిమంగా అది డిహైడ్రేషన్ కు దారితీస్తుంది.
అధిక చక్కెర ఉన్న పదార్థాలు
చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత, జీవక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా జీర్ణక్రియ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. శరీరంలో కొవ్వు పేరుకు పోయేందుకు దారితీస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా పుచ్చకాయలు, నిమ్మకాయల షర్బత్, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే మధుమేహంతో బాధపడేవారు వైద్యుల సూచనల మేరకు ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.