Homeహెల్త్‌Health Tips Reality Check: ఈ ఆరోగ్య చిట్కాలు నిజంగా పనిచేస్తాయా..

Health Tips Reality Check: ఈ ఆరోగ్య చిట్కాలు నిజంగా పనిచేస్తాయా..

Health Tips Reality Check: ఒకప్పుడు కొన్ని మంచి మాటలను పెద్దలు మాత్రమే చెప్పేవారు. వీటిలో ఆరోగ్య ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎన్నో ఇంటి చిట్కాలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అవగాహన లేకుండా కొందరు సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను వినిపిస్తూ ఉంటున్నారు. అయితే వీటిలో కొన్ని నిజం కూడా కావచ్చు. కానీ వాటిని పాటించే ముందు సరైన వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్నిటి గురించి ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి ఆ చిట్కాలు..? వీటివల్ల నిజంగానే ఆరోగ్యం బాగుపడుతుందా..?

కిడ్నీ స్టోన్‌కు యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగమా?

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్ కొన్ని రకాల చిన్న కిడ్నీ రాళ్లను క్రమంగా మృదువుగా చేయడంలో సహాయపడొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలో pH సమతుల్యాన్ని మెరుగుపరచి మూత్ర ప్రవాహాన్ని పెంచడంలో సహకరించవచ్చు. అయితే పెద్ద స్టోన్లు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కేవలం దీనిపై ఆధారపడటం ప్రమాదకరం. అధికంగా తీసుకుంటే కడుపు మంట, దంతాల దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వైద్యుల సలహాతో మాత్రమే వినియోగించడం మంచిది.

వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ బ్లాకేజ్ తొలగిపోతుందా?

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడొచ్చు. అయితే ఇప్పటికే గుండె రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకేజీలను పూర్తిగా కరిగించే శక్తి వెల్లుల్లికి లేదు. క్రమమైన వ్యాయామం, తక్కువ నూనె ఆహారం, అవసరమైతే మందులు కూడా వాడితేనే సమస్యను నియంత్రించగలవు.

నిమ్మరసం ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుందా?

నిమ్మరసంలో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ పనితీరుకు కొంత మేలు చేయవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు నియంత్రణలో ఉండటం వంటి ప్రయోజనాలు కలగొచ్చు. అయితే ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గాలంటే ముఖ్యంగా బరువు తగ్గడం, చక్కెర-నూనె పదార్థాలు తగ్గించడం, వ్యాయామం చేయడం అవసరం. నిమ్మరసం ఒక్కటే దీనికి పూర్తి పరిష్కారం కాదు.

మలబద్ధకం పోవాలంటే గోరువెచ్చని నీరు ఎందుకు మంచిది?

మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం చాలా ఉపయోగకరం. పండ్లు, కూరగాయలు, ఓట్స్, గింజలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రేగుల కదలికలు చురుకుగా మారి మలం సాఫీగా బయటకు రావడానికి సహాయపడుతుంది. అయితే నీరు తక్కువగా తాగుతూ ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత పెరగొచ్చు. కాబట్టి రెండూ సమతుల్యంగా అవసరం.

యూరిక్ యాసిడ్ తగ్గడానికి పసుపు నీరు ఉపయోగమా?

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపు తగ్గించడంలో సహాయపడొచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారిలో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను కొంత తగ్గించే అవకాశం ఉంది. అయితే శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పూర్తిగా కరిగిపోవడానికి కేవలం పసుపు నీరు సరిపోదు. నీరు ఎక్కువగా తాగడం, మాంసాహారం తగ్గించడం, వైద్యులు సూచించే మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇంటి చిట్కాలు కొన్ని సందర్భాల్లో ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇవి పూర్తి చికిత్సగా భావించడం సరైంది కాదు. ఆరోగ్య సమస్యలు ఎక్కువ రోజులు కొనసాగితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version