
కరోనా వైరస్ కు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు మందులను కనిపెట్టలేకపోయారు. మందుల గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కట్టడి కోసం అనేక వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నాయి. రష్యా ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టినట్టు ప్రకటించినా ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అయితే కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కొన్ని మందులు మంచి ఫలితాలను కనబరుస్తూ ఉండటం గమనార్హం. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు హై బీపీకి వాడే మందులు కరోనాపై సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ మందులు కరోనా మరణాల రేటును 33 శాతం తగ్గిస్తున్నాయని తెలుస్తోంది. యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్, యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ అనే మందులను సాధారణంగా మధుమేహం, గుండె జబ్బులు, బీపీతో బాధ పడే వారి కోసం వినియోగిస్తారు.
ఎవరైతే ఆ మందులను వినియోగిస్తున్నారో వారిలో కరోనా ముప్పు గణనీయంగా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. 28,872 మంది రోగులకు శాస్త్రవేత్తలు పరిశీలించారని సమాచారం. అయితే హై బీపీ లేని వాళ్లు ఈ మందులను వినియోగించవచ్చో లేదో తెలియాల్సి ఉంది. డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధ పడుతున్న వాళ్లకు హై బీపీ మందులు సమర్థవంతంగా పని చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.