Dhanteras 2023: ప్రతీ ఏడాది దీపావళి పండుగను విశేషంగా జరుపుకుంటారు. దీపావళిని 5 రోజులు పాటు నిర్వహించుకుంటారు. నోములు, వ్రతాలు చేసేవారికి దీపావళి పెద్ద పండుగే. అయితే దీపావళి పండుగ రోజుల్లో మొదటి రోజు నిర్వ హించుకునేది ధన్ తేరస్. ధన్ తేరస్ అనగానే చాలా మంది ఈరోజున కొంచెం బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కేవలం బంగారం అమ్మకాలకు మాత్రమే ధన్ తేరస్ ప్రత్యేకం అనుకుంటారు. కానీ ధన్ తేరజ్ రోజున కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది ధన్ తేరస్ నవంబర్ 10న ఉదయం 5.45 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.42 వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవితో పాటు గణపతి, ధన్వంతరి, కుభేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళిని 5రోజులు నిర్వహిస్తారు. వీటిలో మొదటి రోజు వచ్చే ధన్ తేరస్ రోజున బంగారం, వెండి వస్తువులు కొనుగులో చేస్తారు. వీటితో పాటు ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఉంటాయని భక్తుల నమ్మకం.
అలాగే ఇదే రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఆయుర్వేద పితామహుడు అయినా ధన్వంతరి సముద్ర మథనం నుంచి ప్రత్యక్షమయ్యారు. అమృత కలశం లోని అమృతాన్ని సేవించి దేవతలు అమరులయ్యారు. అందుకే ధన్వంతరిని ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ధన్ తేరస్ రోజున పూజిస్తారు. ఇదే రోజు కుభేర పూజ నిర్వహిస్తారు. కుభురుడు రాక్షన ప్రవృత్తిని తొలగిస్తాడు. అందుకే ఆయన ఆరాధన చేయడం మంచిదని అంటారు.
ధన్ తేరస్ రోజున యమ పూజ కూడా చేస్తారు. యవధర్మరాజుకు దీపదానం చేయడం వల్ల అకాల మరణం ఉండదని భావిస్తారు. అలాగే గణేశపూజ కూడా ఎంతో శ్రేష్ఠం అని చెబుతున్నారు. ప్రతీ పూజలో గణపతికి మొదటి పూజ ఉంటుంది. అందువల్ల ఈరోజు విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల శుభాలు జరుగుతాయని అంటారు. అలాగే ఇదే రోజున పశువులకు పూజ చేయడం వల్ల గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావిస్తారు.