Yatra 2 vs Rajdhani Files: ఎన్నికలు వస్తున్నాయంటే పొలిటికల్ ప్రాపగాండా చిత్రాలు తెరపైకి వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ‘యాత్ర’ చిత్రాన్ని విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర తెరకెక్కింది. మరోవైపు టీడీపీ ఎన్టీఆర్ బయోపిక్స్ తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు టైటిల్స్ తో రెండు చిత్రాలు విడుదలయ్యాయి.
2024 ఎన్నికలకు ముందు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. వైసీపీ వర్గాలు యాత్ర 2 చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. యాత్ర 2 ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్. వైఎస్ రాజశేఖరెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల సమాహారంగా తెరకెక్కింది. యాత్ర 2 వైఎస్ జగన్ కి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే కోణంలో తెరకెక్కింది. పరోక్షంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై జగన్ పై అక్రమ కేసులు పెట్టారని, జైలు పాలు చేశారని, ఆటుపోట్లు ఎదుర్కొని జగన్ సీఎం అయ్యాడని చెప్పే కోణంలో సినిమా తీశారు.
వై ఎస్ జగన్ హీరోగా సోనియా గాంధీ, చంద్రబాబులను విలన్స్ గా చిత్రీకరించారు. ఇక యాత్ర 2కి పోటీగా విడుదలవుతున్న రాజధాని ఫైల్స్ టీడీపీకి మైలేజ్ తేవాలని తీసిన చిత్రం. సీఎం పీఠం ఎక్కిన వైఎస్ జగన్ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశాడు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరించాడని రాజధాని ఫైల్స్ లో చెప్పాడు. సంక్షేమ పథకాలతో జనాలను సోమరులను చేశాడు. ఆంధ్రప్రదేశ్ ను అప్పులోకి నెట్టాడని చెప్పారు.
కాగా యాత్ర 2 ట్రైలర్ కు మించి రాజధాని ఫైల్స్ ట్రైలర్ కి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ప్రజల మూడ్ టీడీపీ వైపే అని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు థియేటర్స్ లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో తెలియదు కానీ… సోషల్ మీడియాలో అతిపెద్ద చర్చ నడుస్తుంది. మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఇక రాజధాని ఫైల్స్ మూవీకి భాను దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 15న విడుదల కానుంది.