Yashoda Actress Kalpika: సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఈ విషయం బయటపెట్టారు. సమంత లేటెస్ట్ మూవీ యశోద చిత్రంలో ఓ రోల్ చేసిన కల్పిక గణేష్ తాను కూడా మయోసైటిస్ తో బాధపడుతున్నానని చెప్పడం షాకింగ్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక తన ఆరోగ్యంపై స్పందించారు. కల్పిక గణేష్ 13 ఏళ్లుగా స్పాండిలైటిస్ వ్యాధితో బాధపడుతున్నారట. ఆమెకు మయోసైటిస్ సైతం సోకిందట. మయోసైటిస్ తనకు ఫస్ట్ స్టేజ్ లో ఉందట. ఇక సమంత స్టేజ్ త్రీ మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు కల్పిక వెల్లడించారు. ఈ క్రమంలో సమంతను కలిసి మాట్లాడతానని కల్పిక వెల్లడించారు.

కల్పిక లుక్ చాలా మారిపోయింది. దానికి అనారోగ్యమే కారణమని తాజా వ్యాఖ్యలతో స్పష్టత వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో కల్పిక లావుగా ఉండేవారు. సినిమాల్లో రాణించాలని ఆమె బరువు తగ్గారు. తాజా లుక్ లో మాత్రం ఒకప్పటి అందం కోల్పోయారు అనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న కల్పిక డల్ అయ్యారనిపిస్తుంది. నటిగా 2009లో కల్పిక జర్నీ మొదలైంది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ప్రయాణం మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు.
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ప్రయాణం మూవీలో హీరోయిన్ పాయల్ ఘోష్ ఫ్రెండ్ గా పూర్తి స్థాయి పాత్రలో నటించారు. ఆరంజ్, నమో వెంకటేశ, సారొచ్చారు, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడి పడి లేచె మనసు వంటి చిత్రాలు చేశారు. సీత ఆన్ రోడ్ మూవీలో హీరోయిన్స్ లో ఒకరిగా కల్పిక నటించారు. లేటెస్ట్ హిట్ యశోద చిత్రంలో కల్పిక నటించారు.

యశోద మూవీలో నటించిన సమంత, కల్పిక మయోసైటిస్ తో బాధపడటం యాధృచ్చికమే. నిజానికి మయోసైటిస్ 15 ఏళ్ల లోపు పిల్లలకు 45 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్లకు సోకే అవకాశం ఎక్కువ. అలాంటిది సమంత, కల్పికలకు సంక్రమించడం దురదృష్టకరం.యశోద విడుదల అనంతరం సమంత తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పత్రికల్లో వచ్చినట్లు మయోసైటిస్ అంత ప్రాణాంతకం కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను దీంతో పోరాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బయటపడతాననే నమ్మకం ఉందని సమంత తెలియజేశారు.