
దర్శక దిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితోపాటు వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. వీరంతా వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించి కరోనాను జయించారు. వీరంతా కూడా ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్ గా నిలుస్తామని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే వీరంతా నేడు ప్లాస్మా దానం చేసినట్లు రాజమౌళి తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.
రాజమౌళి తనయుడు కాలభైరవ, సంగీత దర్శకుడు కిరవాణి నేడు కిమ్స్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేసినట్లు రాజమౌళి పేర్కొన్నారు. అయితే తాను ప్లాస్మా దానం చేయలేక పోయినట్లు ఆయన తెలిపాడు. వైద్యులు తనకు యాంటీ బాడీస్ కోసం టెస్టు చేయగా ఐజీజీ లెవల్స్ 8.62శాతంగా ఉన్నాయని తేలిందట. వీటి లెవల్స్ 15గా ఉండాలని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి తన పెద్దన్నయ్య, బైరవ మాత్రమే ప్లాస్మాను దానం చేశారని చెప్పుకొచ్చారు. తనలో ఐజీజీ లెవల్స్ పెరిగితే మరోసారి ప్లాస్మాదానం చేసేందుకు తానేప్పుడు రెడీ అని రాజమౌళి చెప్పారు.
ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం షూటింగులకు అనుమతి లభించడంతో కరోనా నిబంధనలు పాటిస్తూనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లోనే షూటింగు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక ఔట్ డోర్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఓలివియా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడే అవకాశం కన్పిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదిని ప్రకటించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.