
Taraka Ratna’s character : నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఏదయితే వినకూడదని అనుకున్నారో అదే విన్నారు. ఏదైతే చూడకూడదు అనుకున్నారో అదే చూస్తున్నారు.. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ ఆసుపత్రిలో అనారోగ్యంతో పోరాడుతున్న తారకరత్న తుది శ్వాస విడిచారు. అతి చిన్న వయసులోనే కన్నుమూశారు.. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు సినీ నటులు తారకరత్నకు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
ఎంత స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా తారకరత్న జీవితమంతా పూలబాట మీద నడవలేదు. కష్టాలు చూసాడు. కన్నీళ్లు అనుభవించాడు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా తన ప్రయాణాన్ని నలుగురు గుర్తుంచుకునేలా చేశాడు. ఏనాడూ పేరు కోసం, స్టార్ డం కోసం పాకులాడిన దాఖలాలు లేవు. బాలకృష్ణ అన్నయ్య మోహనకృష్ణ వారసుడిగా తారకరత్న గురించి బయటి ప్రపంచానికి తెలిసింది 2002 మార్చి 24న. ఎవరికీ సాధ్యం కాని విధంగా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్న తొలి డెబ్యూ హీరోగా మొదటి అడిగే సంచలనంగా నమోదు చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన అప్పటి వేడుకకు వచ్చిన జన సందోహం, కుటుంబ సభ్యుల కోలాహలం గురించి పత్రికల్లో కథలు కథలుగా కథనాలు వచ్చాయి. వాటిలో సగానికి పైగానే విడుదలయ్యాయి.. ఫలితాల విషయం పక్కన పెడితే ఇప్పటికీ అది ఒక రికార్డు. ఇక మిగిలిన సినిమాలు కాంబినేషన్లు మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒకటో నెంబర్ కుర్రాడుతో హీరోగా మొదలుపెట్టిన తారకరత్న అమరావతిలో విలన్ గా చేయడం దాకా ఎన్నో ప్రయోగాలు చేశాడు. దురదృష్టవశాత్తు కెరియర్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అమరావతి సినిమాలో విలన్ గా నటించినందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందించింది. పురస్కారం అందుకున్న వసూళ్ళు తెచ్చే సినిమాలు లేకపోవడం తారకరత్నకు పెద్ద మైనస్.
తారకరత్న వ్యక్తిగత జీవితం కూడా ఒడి దుడుకుల మయమే. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆయనను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.. ఇవే కాదు ఇంకా ఎన్నో సమస్యలు ఆయన చవిచూడాల్సి వచ్చింది. 2012లో అలేఖ్య రెడ్డితో పెళ్లి తర్వాత తిరిగి కుటుంబం దగ్గర కావడంతో తారకరత్న కుదుటపడ్డాడు. నటుడిగా, సహాయ నటుడిగా చేసినప్పటికీ పరాజయాలే పలకరించాయి. ఇక సినిమాలు అంతగా క్లిక్ కావడం లేదని అర్థం అయిన తర్వాత టిడిపిలో చేరి పార్టీకి సేవలందించాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ కొంతకాలానికే ఇలా జరగడం తీవ్ర విషాదం.. ఆరోజు గనుక కుప్పంలో జరిగిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లకుంటే ఇవాళ తారకరత్న కన్నుమూసేవాడు కాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తారకరత్న కెరియర్ పరంగా వందల కోట్ల వసూళ్లు వచ్చే సినిమాలు చేసి ఉండకపోవచ్చు. గొప్ప గొప్ప సినిమాల్లో నటించకపోయి ఉండొచ్చు. కానీ జీవితంలో అన్నీ చూశాడు. కనిపించని రోగంతో ఇన్ని రోజులు ఫైట్ చేశాడు. కానీ చివరికి మరణానికి తలవంచాడు. కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచి వెళ్ళాడు.