
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి కుదిరిందా?. ఇప్పటికే నాగబాబు కుమార్తె నిహారిక వివాహ వేడుకకు రెడీ అవుతున్న మెగా కుటుంబంలో తొందర్లోనే మరో పెళ్లి జరగనుందా?. అంటే అవును అనే సమాధానం వస్తోంది. సోలో బ్రతుకే సో బెటరు అన్న సాయిధరమ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు సమాచారం. ‘నో పెళ్లి దాంతల్లీ ఈ తప్పేం చేయకురా మళ్లీ’ అని పాట పడిన తేజు పెళ్లి కొడుకు అయ్యేందుకు గడియలు దగ్గర పడ్డాయని తెలుస్తోంది. తన సోలో లైఫ్‌ను తొందర్లోనే ముగిస్తున్నట్టు స్వయంగా సాయిధరమ్ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు ఈ రోజు (ఆదివారం) ట్విట్టర్లో ఓ ఆసక్తికర పోస్ట్, వీడియో షేర్ చేశాడు.
Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ ఎప్పుడంటే…
‘ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వచ్చినప్పుడు తప్పదు మరి’ అనే క్యాప్షన్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆర్. నారాయణ మూర్తి డిస్‌ప్లే పిక్చర్తో సింగిల్ ఆర్మీ అనే వాట్సప్ గ్రూప్ ఉంది. ఇందులో నిఖిల్, నితిన్, రానా, సాయితేజ్, ప్రభాస్ ఉన్నారు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నిఖిల్, నితిన్, రానా ఈ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతారు. ఐయామ్ గెట్టింగ్ ఎంగేజ్‌డ్… మిస్‌యూ గాయ్స్ అని మెసేజ్ పెట్టి నిఖిల్ ఎగ్జిట్ అవుతాడు. ఆ వెంటనే ‘ఇకపై నేను భీష్మను కాను. మరొకరితో కలిసిపోయా. సైనింగ్ ఆఫ్’ అంటూ నితిన్ లెఫ్ట్ అయితే.. ‘ఇది ఒక హటాత్ పరిణామం.. సారీ రా అబ్బాయిలూ’ అంటూ రానా కూడా గ్రూప్ నుంచి వైదొలుగుతాడు. చివర్లో ‘ఇట్స్ షో టైమ్. సారీ ప్రభాస్ అన్నా’ అని సాయి ధరమ్ తేజ్ కూడా లెఫ్ట్ అవుతాడు. రేపు ఉదయం 10 గంటలకు మరిన్ని వివరాలు అని ట్వీట్ చేసిన సాయి తన పెళ్లి గురించి ప్రకటన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !
అయితే, ఇదే వీడియోను రీట్వీట్ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కూడా రేపు ఉదయం పది గంటల వరకూ ఓ కన్నేసి ఉంచండి అనిపేర్కొంది. దానికి సోలో బ్రతుకే సో బెటరు హాష్ ట్యాగ్ జతచేసింది. దాంతో, ఇది సాయి పెళ్లి గురించి కాదు సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియో అని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడమో లేదంటే మూవీ రిలీజ్ గురించి ప్రకటన రేపు రావొచ్చు అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే సోమవారం ఉదయం వరకూ వేచి ఉండాల్సిందే. ఒకవేళ సాయి తేజ్ పెళ్లి ఫిక్సయితే మాత్రం… టాలీవుడ్ థర్టీ ప్లస్ బ్యాచిలర్ హీరోల్లో ప్రభాస్ ఒక్కడే ఒంటరి వాడవుతాడు.