Vijay Deverakonda : విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మార్చి 28న ట్రైలర్ విడుదల చేశారు. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు పరశురామ్ గీత గోవిందం మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తాడని అనిపిస్తుంది. కాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. తండ్రి కావాలని ఉంది. అయితే ఇప్పుడే చేసుకోను. దానికి ఇంకా సమయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి మాత్రం పేరెంట్స్ కి నచ్చాలి, అన్నారు. విజయ్ దేవరకొండ మాటలు ఊహాగానాలకు తావిచ్చాయి. హీరోయిన్ రష్మిక మందానతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నాడనే వాదన ఉంది. కొన్నాళ్లుగా వాళ్ళు ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడేమో విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకుంటాను అన్నాడు. అలాగే కొన్నాళ్లు ఆగాలి అంటున్నాడు. ఇవన్నీ సింక్ చేస్తే… విజయ్ దేవరకొండ ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి రష్మిక మందానే అయ్యుంటుందని కొందరి వాదన. వీరిద్దరి ఎఫైర్ పై ఎన్ని కథనాలు వచ్చినా కొట్టిపారేశారు కానీ, ఒప్పుకోలేదు. ఇక కాలమే సమాధానం చెప్పాలి. ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మొదట తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో విడుదల చేస్తారట. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక దర్శకుడు పరశురామ్ తో విజయ్ దేవరకొండకు ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టింది. విజయ్ దేవరకొండ-రష్మిక మందాన జంటగా నటించారు. 2018లో ఈ చిత్రం విడుదల కాగా… ఈ రేంజ్ హిట్ విజయ్ దేవరకొండకు మరలా పడలేదు.