‘తొట్టెంపూడి వేణు’.. స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళ్తే వంటి సినిమాలతో హీరోగా బాగానే సక్సెస్ లు కొట్టాడు. ఐతే, ఆ హీరో స్టేటస్ ను మాత్రం వేణు ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగలేదు. మధ్యలో చాల గ్యాప్ వచ్చింది. అయితే, తాజాగా వేణు ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ వైపు చూపు చూస్తున్నాడు.
‘దమ్ము’ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించినా.. ఆ సినిమా వేణుకి అసలు కలిసి రాలేదు. ఇప్పుడు రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అలాగే రాబోయే రోజుల్లో ఇక పై క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేయాలని వేణు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి వేణు వల్లే త్రివిక్రమ్ రచయితగా నిలదొక్కుకున్నాడు కాబట్టి,
వేణుకి త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తాడా ? చూడాలి. ఒకవేళ, వేణు సక్సెస్ ఐతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే అవుతుంది. ఇక ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మజిలీ’లో రెండో హీరోయిన్ గా నటించిన దివ్యంశ కౌశిక్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే మలయాళ భామ రజిషా కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతోంది. వచ్చే వారం జరగనున్న షెడ్యూల్ లో వేణు ఈ సినిమా యూనిట్ లో జాయిన్ కానున్నాడు.