
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వకీల్ సాబ్ మేనియా ఊపేస్తోంది. సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో.. హై-ఓల్టేజ్ క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది అభిమానుల్లో! సినిమా ఎలా ఉండబోతోంది? రీ-ఎంట్రీ మూవీ పవర్ స్టార్ కు ఎలాంటి రిజల్ట్ ను ఇవ్వబోతోందీ? అనే అంశాలకన్నా.. మూడేళ్ల తర్వాత పవన్ ను చూడబోతున్నామన్న ఆనందమే అభిమానులను నేలపై నిలవనీయట్లేదు.
అయితే.. సినిమాకు కథనం కూడా అత్యంత కీలకం అన్నది కాదనలేనిది. బాలీవుడ్ ఒరిజినల్ ‘పింక్’ మూలాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా.. పవన్ క్రేజ్ కు తగ్గట్టుగా సన్నివేశాలు అల్లుకున్నట్టు చెబుతూ వస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే.. సెకండ్ హాఫ్ లో అదిరిపోయే సర్ ప్రైజ్ ఉంటుందని లీకులు వచ్చిన సంగతి తెలిసిందే.
దాని ప్రకారం మెగా హీరో ఒకరు కనిపించబోతున్నారని ప్రచారం సాగింది. అది మెగాస్టారా? రామ్ చరణా? అనే చర్చలు కూడా సాగాయి. వీళ్లిద్దరూ కాదు పవన్ కొడుకు అఖీరా తెరంగేట్రం చేయబోతున్నాడని కూడా అన్నారు. దీంతో.. ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందనే చర్చ తారస్థాయికి చేరింది. దీంతో.. అప్రమత్తమయ్యాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
అంచనాలు భారీగా పెరుగుతుండడంతో.. వాటిని అందుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి, ఆ విషయాన్ని ప్రీ-రిలీజ్ వేడుకలోనే చెప్పడానికి సిద్ధపడ్డాడు. కానీ.. ప్రేక్షకులు వద్దని అనడంతో ఆగిపోయాడట. ఆ తర్వాత కూడా చర్చ తీవ్రంగా సాగుతుండడంతో.. ఇక ఆగకూడదని డిసైడ్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించాడు.
సెకండ్ హాఫ్ లో సాడ్ సాంగ్ ఒకటి ఉంటుందట. ఆ సాంగ్ ను ఆల్బమ్ లో చేర్చలేదు యూనిట్. సరైన సమయంలో వచ్చే ఆ సాంగ్ ను నేరుగా థియేటర్లో చూసి ఆడియన్స్, అభిమానులను థ్రిల్ చేయాలని దాచిపెట్టినట్టు చెప్పారు. కానీ.. ప్రచారం మరో యాంగిల్ లో సాగుతున్నందు వల్ల బయటపెట్టాల్సి వచ్చిందని చెప్పాడట దర్శకుడు. దీన్నిబట్టి సెకండ్ హాఫ్ లో సర్ ప్రైజ్ పాట మాత్రమేనని తేలిపోయింది.
ఇదిలాఉంటే.. రిలీజ్ కు ముందే వకీల్ సాబ్ ప్రభంజనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని 96 శాతానికిపైగా థియేటర్లన్నీ వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శించబోతున్నాయి. హైదరాబాద్ లోని మల్టీ ఫ్లెక్సులన్నింటా ఇదే సినిమా ఆడబోతోంది. మొత్తం 400 ఆటలు ప్రదర్శించనున్నట్టు సమాచారం. విశాఖలో 65, ఒంగోలులో 25, గుంటూరులో 51, కడపలో 24.. ఇలా భారీ స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, బి, సి, సెంటర్లన్నీ వకీల్ సాబ్ తోనే నిండిపోతున్నాయి. మరి, సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.