
తెలంగాణలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు కోలుకున్నా.. తాజా ఓ సినీ నిర్మాత ఈ వైరస్‌ను జయించలేకపోయారు. కరోనా బారిన పడ్డ టాలీవుడ్ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్ సమర్పకుడు పోకూరి రామారావు (64) శనివారం ఉదయం కన్నుమూశారు. దాంతో, తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి కరోనా మరణం నమోదైంది. కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో రామారావు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ అని తేలిందని సమాచారం.
కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు
రామారావు.. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావుకు సోదరుడు. ఈ తరం ఫిలిమ్స్‌కు ఆయన సమర్పకుడిగా ఉండేవారు. ‘నేటి భారతం’ ‘వందే మాతరం’, ‘ఎర్ర మందారం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘యజ్ఞం’, ‘రణం’ వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. కాగా, రామారావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరోవైపు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా ఈ మధ్య తిరిగి ప్రారంభమైన షూటింగ్స్‌లో పాల్గొంటున్న టీవీ సీరియల్ నటులకు వైరస్ సోకింది. బిగ్‌బాస్ 3 ఫేమ్ రవికృష్ణతో పాటు నటి నవ్య స్వామి, రాజశేఖర్, సాక్షి శివకు పాజిటివ్ అని తేలింది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కూడా వైరస్ బారిన పడ్డా ఆయన కోలుకున్నారు.