
Tollywood Loop Holes : సినిమా ఒక మాయా ప్రపంచం. తెరమీద పాత్రల్లోనే కాదు ఆ పాత్రలు చేసే నటుల నిజ జీవితాల్లో కూడా నాటకీయత ఉంటుంది. పైకి కనిపించేదంతా నిజం కాదు. సిల్వర్ స్క్రీన్ మీద విలాసవంతమైన ఇంట్లో, ఖరీదైన కార్లలో తిరిగే కొందరు నటులు… షూటింగ్ అయ్యాక నడుచుకుంటూ ఇంటికి వెళతారు. ఓ స్లమ్ ఏరియాలో రేకుల షెడ్లో నిద్రిస్తారు. జమిందారు పాత్ర అనగానే కోటు ధరిస్తారు. తళతళలాడే ఆ కోటు నిజం కాదు దాని వెనకున్న చిరుగులు బన్నీనే నిజం. పద్మనాభం, కాంతారావు, రామా ప్రభ, శ్రీలక్ష్మి, గుండు హనుమంతు, పావలా శ్యామల, ఎల్బీ శ్రీరామ్, పాకీజా, గీతా సింగ్ వీరందరూ ఎవరు?… గొప్ప నటులు. ఏళ్ల తరబడి చిత్ర పరిశ్రమకు సేవ చేసినవాళ్లు. వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్స్. సిల్వర్ స్క్రీన్ పై ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ప్రేక్షకులను కట్టిపడేయంలో రాటు తేలిన కళామతల్లి బిడ్డలు. ఇది ఒక సైడ్.
కన్నీరు తెప్పించే మరో సైడ్ కూడా ఉంది. వారు పేద కళాకారులు. తిండి, బట్ట, గూడు వంటి కనీస అవసరాలు తీర్చుకోలేని దురదృష్టవంతులు. ఇటీవల ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఆటోకి డబ్బుల్లేక రోడ్డు మీద నడిచెళుతున్న పాకీజా అలియాస్ వాసుకిని ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ చూసి గుర్తు పట్టారు. ఆమెను వివరాలు అడిగితే గుండె ద్రవించి పోయింది. మంచి భోజనం తిని ఆరు నెలలు అవుతుంది. తిండికి బట్టకు కూడా కష్టం అవుతుంది. షుగర్ సోకింది, వైద్యానికి డబ్బులు లేవు. తమిళ పరిశ్రమ పెద్దలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న నాథుడు లేదన్నారు. సదరు యూట్యూబ్ యాంకర్ భోజనం పెట్టింది పంపాడు.

200 సినిమాల్లో నటించిన పాకీజాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పాకీజా లాంటోళ్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేలల్లో ఉన్నారు. టాలీవుడ్ లో వందల్లో ఉంటారు. ఆరు దశాబ్దాల పాటు విలక్షణ పాత్రలు చేసిన రామా ప్రభకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాజనాల, పద్మనాభం, కాంతారావు చివరి రోజులు దుర్భరంగా ఎందుకు ముగిశాయి? లేడీ కమెడియన్ లక్ష్మి మూడు పూటలా తింటున్నారా?.. అంటే మన దగ్గర సమాధానాలు ఉండవు. నటులవి భద్రత లేని ఉద్యోగాలు. నేమ్, ఫేమ్, ఆఫర్స్ ఉన్నన్నాళ్ళే వెలుగు. లేదంటే ఒక్కసారిగా జీవితాలు రోడ్డున పడిపోతాయి.
ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, కమెడియన్స్, జూనియర్ ఆర్టిస్స్ దోపిడికి గురవుతున్నారు. సినిమా బడ్జెట్ లో సింహభాగం హీరో, దర్శకుడు, హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్ కే పోతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు పరోక్షంగా మిగతా ఆర్టిస్స్ ని సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. అతి కొద్ది మంది నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మాత్రమే రోజుకు లక్షల్లో తీసుకుంటారు. మిగతా వాళ్లది అత్తెసరు రెమ్యూనరేషన్. జూనియర్ ఆర్టిస్ట్స్ పరిస్థితి అయితే దారుణం. హైదరాబాద్ వంటి మహానగరం రోజుకు వెయ్యి రెండు వేలు సంపాదనతో కుటుంబానికి నెట్టుకు రావడం గగనం.

సినిమాకు హీరో ముఖ్యం. అతని ఫేమ్ ఆధారంగానే బిజినెస్ జరుగుతుంది. అదే సమయంలో సినిమా సమష్టి కృషి. హీరోతో పాటు ప్రతి ఒక్కరి అవసరం ఉంది. కానీ హీరో రెమ్యూనరేషన్ యాభై కోట్లు వంద కోట్లు ఉంటుంటే ఆయన పక్కన నటించే, ఆ పాత్ర రక్తి కట్టించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ వేలల్లో కూడా ఉండటం లేదు. హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి రెమ్యూనరేషన్ లో వేల రెట్లు వ్యత్యాసం. పట్టుమని 10 సినిమాలు చేయని హీరో విలాసవంతమైన బంగ్లా, బెంజ్ కార్లో తిరుగుతాడు. దశాబ్దాల పాటు వందల చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కనీసం రెండు గదుల సొంత ఇల్లు ఉండదు.
దశాబ్దాలుగా చిన్న నటులు దోపిడీకి గురవుతున్నారు. హీరోలు రెమ్యూనరేషన్ కోట్లకు కోట్లు పెంచినా నిర్మాతలు కిక్కురుమనరు. పైగా అడ్వాన్సులు ఇవ్వడానికి ఇంటి మూడు క్యూ కడతారు. అదే ఒక సాధారణ ఆర్టిస్ట్ లేదా జూనియర్ ఆర్టిస్ట్ పదో పరకో పెంచమంటే బడ్జెట్ లెక్కలు వేస్తారు. పేరున్న నటులే దుర్భర జీవితాలు గడుపుతుంటే… పరిశ్రమనే నమ్ముకుని ఎలాంటి గుర్తింపుకి నోచుకోకుండా పని చేస్తున్న చిన్నా చితకా ఆర్టిస్ట్స్ సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బందుల్లో ఉన్న ఆర్టిస్ట్స్ ని ఆదుకున్నామని లక్షో రెండు లక్షలో ఇచ్చి ఫోటోలకు ఫోజిచ్చే హీరోలు గమనించాల్సింది ఏంటంటే… మీరు సాయం చేసే పరిస్థితి వాళ్లకు మీ వల్లే వచ్చింది. మీరు తీసుకునే కోట్ల రెమ్యూనరేషన్ నుండి కొంత తగ్గించుకొని మిగతా ఆర్టిస్ట్స్ కి మెరుగైన రెమ్యూనరేషన్స్ అందేలా చేయండి. మీలా కాకపోయినా కనీస అవసరాలకు ఇబ్బంది పడకుండా గౌరవంగా బ్రతికేలా చూడండి. మిమల్ని చేయిచాచే పరిస్థితి తేకండి. వంద కోట్ల హీరో ఒక పాతిక తగ్గించుకొని ఇతర నటులకు రెమ్యూనరేషన్ గా ఇస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి?. పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ దుర్భర జీవనం సాగిస్తున్న ప్రతి ఆర్టిస్ట్ పాపం హీరోలదే..! ఇది సత్యం!