
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పడం.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని ప్రముఖులతో మెగాస్టార్ సమావేశం నిర్వహించడం.. అనంతరం పేర్ని నాని హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిసి వెళ్లడం అన్నీ జరిగిపోయాయి. కానీ.. సీఎంతో సమావేశం ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో.. అసలు సమావేశం ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సమావేశం తేదీ ఖరారైందని తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణలో అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. కానీ.. ఏపీ నుంచే సరైన సహకారం లేదని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీ మొదలు.. కరెంటు బిల్లుల బకాయిల వరకు పలు సమస్యలు ఉన్నాయి. అయితే.. వీటన్నింటికన్నా పెద్ద సమస్య టికెట్ రేట్ల తగ్గింపు. వకీల్ సాబ్ సినిమా సమయంలో ఉన్నట్టుండి ప్రభుత్వం రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పదేళ్ల నాటి రేట్లు ఇప్పుడు అమలు చేయాలంటూ సర్కారు జీవో తెచ్చింది. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది.
ఈ సమస్యను పరిష్కరించుకోవడమే ప్రధాన ఎజెండాగా జగన్ తో సమావేశం కావాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న పరిశ్రమకు జగన్ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇప్పటి వరకూ అందలేదు. వీటితోపాటు మిగిలిన సమస్యలను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించామయ్యేలా చూడాలనుకుంటున్నారు. అయితే.. మీటింగ్ ఎప్పుడు అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. సీఎం జగన్ వ్యక్తిగత టూర్ కు వెళ్లడంతో సమావేశానికి టైమ్ కుదరలేదు. అయితే.. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసేందుకు చూస్తున్నట్టు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 4వ తేదీన జగన్ తో మీటింగ్ కు అపాయింట్ మెంట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబరులో పెద్ద సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందువల్ల ఈ లోగానే ప్రభుత్వం టికెట్ రేట్ల విషయాన్ని తెగ్గొడితే.. ఇబ్బందులు తప్పుతాయని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మరి, ఆ రోజు మీటింగ్ ఖరారవుతుందా? సినీ ఇండస్ట్రీ డిమాండ్లకు సర్కారు అంగీకరిస్తుందా? అన్నది చూడాలి.