Tiragabadara Saami Trailer : రాజ్ తరుణ్ ఆరంభంలో మెరుపు మెరిపించాడు. యూత్ లో విపరీతమైన ఫేమ్ తెచ్చుకున్నాడు. ఉయ్యాలా జంపాలా, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ వంటి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. రాజ్ తరుణ్ ఒక స్థాయి హీరో కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ వరుస పరాజయాలతో రాజ్ తరుణ్ రేసులో వెనుకబడ్డాడు. ఏకంగా సపోర్టింగ్ రోల్స్ స్థాయికి పడిపోయాడు. రాజ్ తరుణ్ గత చిత్రం నా సామిరంగ. నాగార్జున హీరోగా నటించిన ఈ సంక్రాంతి చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్స్ చేశారు.
మరోసారి సోలో హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం తిరగబడర సామీ. ఈ చిత్రానికి ఏఎస్ రవి కుమార్ దర్శకుడు. మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటించారు. విడుదలకు ఈ మూవీ సిద్ధం అవుతుండగా టీజర్ విడుదల చేశారు.
లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రాజ్ తరుణ్ ఈ చిత్రంలో మాస్ రోల్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీశాడు. మొదటిసారి ఊరమాస్ పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ తరుణ్ పాత్రలో రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎవరి జోలికి వెళ్లని ఒక సాఫ్ట్ జెంటిల్ మెన్, అలాగే శత్రువులకు చుక్కలు చూపించే తెగించిన కుర్రాడిగా ఆయన కనిపించనున్నాడు. ఒక దశకు వచ్చాక ఎవరి సహనమైనా నశిస్తుంది. ఒక సౌమ్యుడు, సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుందో సినిమాలో చెప్పారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
మకరంద్ పాండే విలన్ రోల్ చేశాడు. ఆయన లుక్, క్యారెక్టర్ డిజైన్ ఆసక్తి రేపుతోంది. కాగా ఈ చిత్ర దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నాడు. యజ్ఞం వంటి సూపర్ హిట్ మూవీ తీసిన రవికుమార్ తిరగబడరసామీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ చిత్రం విడుదల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. మరి రాజ్ తరుణ్-రవి కుమార్ లకు ఈ చిత్రం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి…