Mahanati Savitri : లెజెండరీ నటి సావిత్రి ఇండియన్ సినిమాపై చెరగని ముద్రవేసింది. నటిగా ఆమె సాధించిన విజయాలు, అందుకున్న గౌరవాలు ఎవరూ చేరుకోలేనివి. స్టార్ హీరోలకు మించిన స్టార్డం అనుభవించిన నటి సావిత్రి. ఒక దశలో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కంటే కూడా ఎక్కువ పారితోషికం తీసుకున్నారట. బాల్యం నుండి నాటకాలు ఆడే సావిత్రికి తండ్రి లేడు. దాంతో పెదనాన్న వద్ద పెరిగింది. ఆయన నృత్యంలో శిక్షణ ఇప్పించాడు.
హీరోయిన్ కావాలని పెదనాన్నతో పాటు చెన్నై వెళ్ళింది. అప్పటికి కేవలం 13 ఏళ్ల వయసు కావడంతో ఆఫర్స్ రాలేదు. తిరిగి సొంతూరు వచ్చి కొన్నాళ్ళు నాటకాలు ఆడింది. అప్పుడే ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది. 1951లో విడుదలైన పాతాళ భైరవి మూవీలో డాన్సర్ గా కొన్ని క్షణాలు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. హీరోయిన్ గా సావిత్రి మొదటి చిత్రం పెళ్లి చేసి చూడు. 1952లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో. పెళ్లి చేసి చూడు హిట్ అయ్యింది.
1953లో విడుదలైన దేవదాసు సావిత్రికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఏఎన్నార్-సావిత్రి జంటగా నటించిన ఈ ట్రాజిల్ లవ్ డ్రామా భారీ విజయం అందుకుంది. ఇక మిస్సమ్మ మూవీతో సావిత్రి ఫేమ్ ఎల్లలు దాటేసింది. మాయాబజార్, గుండమ్మకథ వంటి ఆల్ టైం క్లాసిక్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. వృత్తిపరంగా అద్భుతాలు చేసిన సావిత్రి.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ సమస్యలే.
పెళ్ళై, పిల్లలు ఉన్న జెమినీ గణేశన్ ని సావిత్రి రహస్య వివాహం చేసుకుంది. ఇది అనేక వివాదాలకు కారణమైంది. దానగుణం, మనుషులను నమ్మడం, చిత్రాలు నిర్మించడం వలన సంపద కరిగిపోయింది. రిచెస్ట్ హీరోయిన్ కాస్తా… ఇల్లు, కార్లు, నగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త ప్రేమకు కూడా దూరమైన సావిత్రి మద్యానికి బానిస అయ్యింది.
దానికి తోడు సావిత్రి స్టార్డం కోల్పోయింది. క్యారెక్టర్ రోల్స్ కి పడిపోయింది. 1980లో బెంగుళూరులోని చాణక్య హోటల్ లో సావిత్రి కోమాలోకి వెళ్లారు. ఆమెను చెన్నై తరలించారు. ఇంటి వద్దే వైద్యం అందించారు. 19 నెలలు సావిత్రి కోమాలో ఉన్నారు. 1981 డిసెంబర్ 26న సావిత్రి తుది శ్వాస విడిచారు. సావిత్రి అంత్యక్రియలకు ఏఎన్నార్, గుమ్మడి, జయసుధ, ఎంజీఆర్ వంటి నటులు హాజరయ్యారు.
సావిత్రి అంత్యక్రియల బాధ్యత దాసరి నారాయణరావు దగ్గరుండి చేసుకున్నారట. అయితే ఎన్టీఆర్ హాజరుకాలేదట. ఆయన బిజీగా ఉండటంతో సావిత్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదట. ఈ క్రమంలో ఎన్టీఆర్ తరపున బాలకృష్ణ సావిత్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడట. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లలో ఎవరూ పాల్గొనలేదట. ఒక్క బాలకృష్ణ మాత్రమే సావిత్రి అంత్యక్రియలకు హాజరయ్యారట.