Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి సినిమా ‘అయ్యప్పనుం కోషియుం’. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు. అయితే, ఎప్పటికైనా ఒరిజినల్ ఒరిజినలే కదా. ఏ భాష నుంచి ఏ భాషకు పోయినా ఇదే స్థితి. అర్జున్ రెడ్డికి హిందీలో, తమిళంలో ఏ గతి పట్టిందో తెలిసిందే.

రీమేక్ సినిమాలు పెద్దగా ఆడవు. దీనికి కారణం.. భాష, ప్రాంతీయ నేపథ్యం. అదే నేపథ్యం మరొక భాష, ఆ భాషకు చెందిన సంస్కృతిలో యథాతథంగా ఇమడవు. మలయాళం నుండి తెలుగుకు అనువదించే సినిమాల్లో నేపథ్య సమస్యే కాక ప్రేక్షక అబిరుచి సమస్య కూడా ఉంటుంది. మలయాళంలో అంతో ఇంతో నిజజీవిత పాత్రలే హీరోలు. కానీ, తెలుగులో హీరో అంటే మామూలు మనుషుల కన్నా గొప్పవాడు.
తెలుగు సినిమాల్లో సింహభాగం గోదావరి, కృష్ణా జిల్లాల నేపథ్యమే. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు అలాంటి నేపథ్యం వెతకాలి. లేకపోతే ఈ రీమేక్ కూడా రెగ్యులర్ సినిమా అయిపోతుంది. అయినా అయ్యప్పనుం కోషియుం సినిమాలో కోషి పాత్రధారి (సుకుమారన్) లుంగీ లాగి పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకుని వస్తారు. తెలుగు హీరో పంచె లాగితే ఏకంగా ప్రళయం వస్తుంది. మరి ఇలాంటి సీన్స్ ను తెలుగులో ఎలా తీస్తారు ?
మార్చి తీస్తే.. కథలో ఎమోషన్ పోతుంది. పైగా మలయాళ మాతృకలో ఒక సామాజిక సమస్యను చక్కగా ఎలివేట్ చేసి షూట్ చేశారు. భారీ డైలాగులు, నీతిబోధలు, ప్రగల్భాలు లేవు. కానీ అవి లేకుండా స్టార్ హీరో సినిమా తెలుగులో ఉండవు కదా. మరి వాటి మాటేమిటి ? ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పై చాలా అనుమానాలు ఉన్నాయి.