Vanga Brothers: కేవలం టాలెంట్ ని నమ్ముకున్న సందీప్ రెడ్డి వంగ స్టోరీ వింటే ఇన్స్పైర్ కావడం ఖాయం. సినిమా అనేది జూదం. వంద సినిమాలు విడుదలైతే హిట్ అయ్యేవి రెండే. టాలీవుడ్ సక్సెస్ పర్సెంట్ కేవలం 2 శాతమే. ఒక మూవీ తీయడం అంటే మామూలు విషయం కాదు. పరిశ్రమకు వందల మంది నిర్మాతలు వచ్చారు. వారిలో మిగిలింది కొందరే. సందీప్ రెడ్డి వంగ రిస్క్ కి ఎదురెళ్లి సక్సెస్ అయ్యాడు.
సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో నిర్మాతలు దొరక్క ఆయనే నిర్మాత అయ్యాడు. ఎందుకంటే కొత్త దర్శకులకు నిర్మాతలు అవకాశం ఇవ్వరు. డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి వెనుకా ముందు ఆలోచిస్తాడు. అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించడానికి సందీప్ రెడ్డి వంగ భారీ రిస్క్ తీసుకున్నాడు. 36 ఎకరాల మామిడి తోట అమ్మేశాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ్ముడిని అది మాన్పించి, ఇండియాకు పిలిచాడు.
నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. భద్రకాళి ఫిలిమ్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి అర్జున్ రెడ్డి తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి 2017లో అతిపెద్ద సెన్సేషన్ సృష్టించింది. హీరో క్యారెక్టరైజేషన్ కి కొత్త అర్థం చెప్పాడు. వివాదాలు చుట్టుముట్టినా అర్జున్ రెడ్డి చిత్రాన్ని జనాలు చూడకుండా ఆగలేదు. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కొట్టింది.
అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. కబీర్ సింగ్ కి దర్శకత్వం మాత్రమే వహించాడు. కబీర్ సింగ్ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగ నిర్మాణ భాగస్వామి అయ్యాడు. ప్రణయ్ రెడ్డి వంగ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. భూషణ్ కుమార్ తో కలిసి నిర్మించిన యానిమల్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
రన్బీర్ కపూర్ హీరోగా రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన యానిమల్ రూ. 900 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ మూవీ లాభాల్లో వాటాగా రూ. 200 కోట్లు సందీప్ రెడ్డి వంగకు దక్కాయట. ఆస్తులు, ఉద్యోగం వదులుకుని సినిమాను నమ్ముకున్న వంగ బ్రదర్స్ కి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యిందని టాలీవుడ్ టాక్. ఏమైనా వంగ బ్రదర్స్ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే…