Maruthi: ప్రతీ మనిషి జీవితం లో అదృష్టం ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వరిస్తుంది. దొరికిన ఆ అదృష్టాన్ని సరైన పద్దతిలో ఉపయోగించుకొని ముందుకు వెళ్తేనే జీవితం లో ఎవ్వరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలా డైరెక్టర్ మారుతీ కి కూడా అదృష్టం తలుపుతట్టింది. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అవలీల గా రాబట్టగలిగే సత్తా ఉన్న ప్రభాస్, ఫ్లాపుల్లో ఉన్న మీడియం రేంజ్ డైరెక్టర్ మారుతీ కి తనతో సినిమా తీసే అవకాశం ఇస్తాడని ఎవ్వరైనా ఊహించారా?. కానీ ప్రభాస్ ఆ అవకాశం ఇచ్చాడు. ఇలాంటి బంపర్ ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ కూడా వదులుకోడు. ఎంతో జాగ్రత్తగా సినిమా తీసి, భారీ కమర్షియల్ హిట్ కొట్టాలనే అనుకుంటాడు. కానీ మారుతీ మాత్రం అలా అనుకోలేదు. ఎలా తీసిన చూసేస్తారులే అనే యాటిట్యూడ్ తో సినిమాని తీసినట్టుగా అనిపించింది.
అందుకే ఆడియన్స్ ఈ సినిమాని రెండు రోజులకే తొక్కేశారు. సినిమా మొత్తాన్ని ఫిల్లర్ సన్నివేశాలతో నింపేసి , ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ , ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ మాత్రమే అసలైన స్టోరీ ని పెట్టాడు. ఇలాంటి చెత్త టేకింగ్ తో ఈమధ్య కాలం లో ఒక్క సినిమా కూడా రాలేదు. తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉండుంటే మారుతీ పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయనతో మీడియం రేంజ్ హీరో కూడా సినిమా చేయడానికి భయపడుతున్నాడు. అయితే మారుతీ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో చెయ్యాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తుంది. వెంకటేష్ తో ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట మారుతి.
గతం లో ఆయన విక్టరీ వెంకటేష్ తో ‘బాబు బంగారం’ అనే సినిమా చేసాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. అప్పట్లో మారుతీ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుండేవి. కామెడీ టైమింగ్ లో కొత్తదనం కనిపించేది. అలాంటి రోజుల్లో వచ్చిన సినిమానే యావరేజ్ రేంజ్ లో ఆడింది అంటే, ఇక ఆయనలో పస తగ్గిపోయిన ఈ టైం లో ‘రాజా సాబ్’ ని చూసి కూడా వెంకటేష్ అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త ఏమిటంటే, వెంకటేష్ మారుతి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని అంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన వెంకటేష్, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తదుపరి సినిమాలు కూడా అదే రేంజ్ కాంబినేషన్ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. మరి అలాంటి సమయం లో మారుతీ తో సినిమా అంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి.