Telusu Kada Movie Review : నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు తదితరులు.
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ VS
దర్శకత్వం: నీరజ కోన
అచ్చ తెలంగాణ యాస.. పైగా హైదరాబాదీ ఫ్లేవర్.. ‘అట్లుంటదీ మనతోని’ అనగానే యావత్ తెలుగు సమాజమే కాదు.. మన పుష్ప రాజ్ అల్లు అర్జున్ కు కూడా ఫేవరెట్ హీరో అయిపోయాడు మన డీజే టిల్లు.. అట్లంటి సిద్ధు నుంచి సినిమా వస్తుందంటే చాలు మినమం ఉంటదనుకుంటాం.. అట్లా లేకపోతే ఫీల్ అయిపోయాతాం.. ఈసారి అలానే ఉన్న ఫళంగా ఊడిపడ్డాడు మనోడు..
డీజె టిల్లు, టిల్లు స్క్వేర్ విజయాలతో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించే సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతంగా ఆసక్తి పెరిగింది. టిల్లు లాంటి కల్ట్ క్యారక్టర్ పోషించిన తర్వాత సిద్ధు నుంచి ప్రేక్షకులు అదే రేంజ్ సినిమాలను ఆశించడం సహజం. తన లేటెస్ట్ చిత్రం ‘మీకు తెలుసా’ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం.
అనాథ అయిన వరుణ్(సిద్ధు) కు జీవితంలో కొన్ని లక్ష్యా లుంటాయి, గొప్పగా స్థిరపడాలని, పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో ఇల్లు కళళలాడుతూ ఉండాలనేవి అందులో ముఖ్యమైనవి. దానికి తగ్గట్టే జీవితంలో గొప్పగా స్థిరపడతాడు. ఒక పెద్ద రెస్టారెంట్ కు ఓనర్ అవుతాడు. అంజలి(రాశి ఖన్నా)ను పెళ్ళి కూడా చేసుకుంటాడు. అంతా బాగుందని అనుకుంటూ ఉండగా అంజలికి పిల్లలు పుట్టరనే విషయం భార్యాభర్తలకు పెద్ద షాక్ ఇస్తుంది. సరోగసీ ద్వారా పిల్లలను కనాలనే ప్రయత్నాలు చేసే సమయంలో వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాగ(శ్రీనిధి శెట్టి) ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగాయనేది కథ.
సినిమా థీమ్ వరకూ బాగానే ఉంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల కథలలో జీవించేసిన పాత తరం శోభన్ బాబు లాంటి, మునుపటి తరం హీరో జగపతి బాబుల పాత్రలు పరిస్థితుల ప్రభావం వల్ల, లేదా ఏదో ఒక పొరపాటు అలా జరిగింది అన్నట్టు ఉండేవి. ఇక్కడ ఏం జరిగిందంటే సిద్దు పాత్ర అతి తెలివైంది, దాంతో హీరో సమస్యలో ఇరుక్కున్నాడు అనుకుని ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. జాలి కూడా కలగదు. పైగా శ్రీనిధి పోషించిన రాగ పాత్ర కొంత గజిబిజిగా ఉండడంతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కు కారణం అయిన రాగ పాత్ర కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంది, దానికి కారణాలు ఏంటి అనేవి సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో తన ప్రవర్తన ఎవరికీ అర్థం కాదు. ఆ పాత్రతో ప్రేక్షకులు జర్నీ చేయలేరు. దాంతో సినిమా అటు కామెడీ కాకుండా ఇటు ఫ్యామిలీ డ్రామా కాకుండా పోయింది.
కొన్ని చోట్ల మంచి డైలాగ్స్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం బోల్డ్ పేరుతో శృతి మించాయి. ఒక సీన్ లో భార్య భర్తలయిన సిద్దు రాశితో “విప్పేయ్” అనడం, రాశి “కండోమ్స్ లేవు” అనడం ఆ సీన్ కు అవసరమే లేదు. ఇదంతా సిద్దుకు యూత్ లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇరికించిన వ్యవహారంలా ఉంది తప్ప సహజంగా అనిపించలేదు. ఇక సినిమాలో ఉన్న ఒక గొప్ప ఊరట ఏంటంటే హర్ష చెముడు పోషించిన సిద్దు ఫ్రెండ్ పాత్ర. దాదాపు హర్ష ఉన్నంత సేపు ఏదో ఒక రకంగా నవ్వించే ప్రయత్నం చేశాడు.
తమన్ సంగీతం బాగుంది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు బాగున్నాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వల్ల విజువల్స్ బాగున్నాయి. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న థీమ్ బాగుంది కానీ బలమైన పాత్రలు డిజైన్ చేయలేకపోయింది. దాంతో సినిమాలో ప్రధాన పాత్రలతో ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశమే రాలేదు. అయితే సిద్ధు మాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్, తనదైన స్టైల్ తో పాత్రను పోషించాడు, సీరియస్ ఎమోషనల్ సీన్స్ లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
2. కథలో కాన్ ఫ్లిక్ట్ సహజంగా అనిపించకపోవడం.
3. వీక్ సెకండ్ హాఫ్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సిద్ధు నటన
2. చాలా చోట్ల మెరిసిన డైలాగులు
3. సాంగ్స్
ఫైనల్ వర్డ్: తెలుసో లేదో తెలీకుండానే తెల్లారిపోయింది బాబయ్యా..
రేటింగ్: 2.25/5
నాతోపాటు సగటు ప్రేక్షకుడు బయటకొచ్చిన చెప్పిన మాట ఒకటే.. ఈ సినిమా థియేటర్లో కంటే ఓటీటీలో బాగా ఆడుతుందని.. దీని కోసం పెళ్లాం పిల్లలు, బండి, పెట్రోల్ పోసుకొని రావడం కొంచెం కష్టమే అని.. కరోనా తర్వాత జనాల మైండ్ సెట్ మారింది. ఇంకా బంధాలు, భవబందాల చుట్టు కథలు అల్లితే తీసేవారికి ఓపిక ఉండొచ్చు కానీ.. చూసేవాడికి ఉండకపోవచ్చు. బయటకొచ్చి ఇదే వాగొచ్చు. సో మేకర్స్ జర చెత్తగా ఆలోచించకండి.. కొత్తగా ప్రయత్నించండి.
– రాము కోవూరు