Singer Sunitha: సింగర్ సునీత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రెండో వివాహం అనంతరం ఆమె పలు సమస్యల నుండి బయటపడ్డారని సమాచారం. ప్రొఫెషనల్ గా సక్సెస్ అయిన సునీత వ్యక్తిగతంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 19 ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త కారణంగా ఆర్థికంగా నష్టపోయారట. మానసిక వేదన అనుభవించారట. సహనం నశించి అతన్ని వదిలించుకున్నారు. విడాకులిచ్చి విడిపోయారు. తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న సునీతకు మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని నుండి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ప్రొఫెషనల్ గా ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉంది. 2020లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సునీత-రామ్ 2021లో వివాహం చేసుకున్నారు.

సునీత రెండో పెళ్లి నిర్ణయం వివాదాస్పదమైంది. పిల్లలతో పాటు తన భవిష్యత్తు కోసమే ఈ పెళ్లి అంటూ సునీత వివరణ ఇచ్చారు. అభిమానులు మద్దతుగా నిలవాలంటూ రిక్వెస్ట్ చేశారు. రామ్ తో వివాహం అనంతరం సునీత లైఫ్ సెటిల్ అని చెప్పాలి. ఆమె జీవితం రంగులమయమైంది. ఇక పిల్లల కెరీర్స్ పై దృష్టిపెట్టిన సునీత… కొడుకును హీరో చేస్తుంది. ఇటీవలే సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఓ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.
కూతురు శ్రియా తల్లి వారసత్వం తీసుకున్నారు. ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల సునీత ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనపై వచ్చే విమర్శలను ఎలా తీసుకుంటారో తెలియజేశారు. ఒకరి విమర్శలు నేను పట్టించుకోను. నేను నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎలా చేరుకోవాలో ఆలోచిస్తాను. నేను ఏమి చేయగలనో, నా సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు. జీవితంలో మరో స్థాయికి వెళ్లేందుకు విమర్శలు పట్టించుకోకుండా ప్రయాణం సాగిస్తాను అన్నారు.

ఈ సందర్భంగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు మరణాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలో అతి ముఖ్యమైన ఎస్పీ బాలు గారు చనిపోయారు. ఆ సంఘటన తర్వాత ఏం జరిగినా నాకు కన్నీరు రావడం లేదు. బాలు గారిని కోల్పోవడం కంటే బాధించే విషయం మరొకటి ఉండదని నా భావన, అని చెప్పుకొచ్చారు. బాలుతో సునీతకు ఏళ్ల తరబడి సాన్నిహిత్యం ఉంది. సుదీర్ఘ కాలం కలిసి పనిచేశారు. ఎస్పీ బాలును సునీత మామయ్య అని ఆప్యాయంగా పిలిచేవారట. 2020 సెప్టెంబర్ 25న బాలు కరోనా కారణంగా కన్నుమూశారు.