Uma Ramanan: ఆమె పాట పాడితే వసంత కాలంలో కోయిలలు కూసినట్టు ఉంటుంది. ఆమె గొంతు సవరిస్తే తుమ్మెదలు ఘీంకారాలు చేసినట్టనిపిస్తుంది.. ఆమె స్వరం వేయి వేణువులను తలపిస్తుంది. ఆమె గాత్రం రామచిలకల సయ్యాటలను పోలి ఉంటుంది.. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఆమె గొంతు శాశ్వత సెలవు తీసుకుంది. కోట్లాదిమంది అభిమానులను అలరించిన ఆమె కంఠం ఇక స్వస్తి అంటూ వెళ్లిపోయింది.
ప్రముఖ తమిళ నేపథ్య గాయని ఉమా రమణన్(72) అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. ఆమెకు భర్త ఏవీ రమణన్, కుమారుడు విఘ్నేశ్ రమణన్ ఉన్నారు. తమిళంలో ఉమా ఎన్నో పాటలు పాడారు. శాస్త్రీయ గాయకురాలైన ఉమ.. 35 ఏళ్లుగా తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు 6000 కచేరిలలో పాల్గొన్నారు. తమిళంలోని నిజాల్ గల్ అనే సినిమాలో ” పుంగా తావే తాళ్తి రావై” అనే పాట ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇళయరాజా స్వరపరిచిన “తూరల్ నిన్ను పొచ్చు” సినిమాలోని “భూపాలం ఇసైక్కుమ్”, “పున్నర్ పుష్పంగళ్” సినిమాలోని “ఆనందరాగం”, “తేంద్రలే ఎన్నై తోడు” సినిమాలోని “కణ్మని నీ వర” , “దైర్ ఖైదీయన్” సినిమాలోని “పొన్ మానే”, అరంగేట్ర వేలై, ఆగాయ వెన్నిలావే, శ్రీరంగనాథనిన్ వంటి పాటలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. విజయ్ నటించిన తిరుపాచి అనే సినిమాలో “కన్నుమ్ కన్ను మ్తాన్ కలం దాచు” అనే పాట ఆమె చివరిది.
ఉమా మరణం తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఉమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. తమిళ ఇతర పరిశ్రమ చెందిన పలువురు సంగీత దర్శకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ఉమ మరణం నేపథ్యంలో తమిళనాడు సింగర్స్ అసోసియేషన్ శుక్రవారం రికార్డింగ్, డబ్బింగ్ వంటి కార్యక్రమాలకు సెలవు ప్రకటించింది.