Tollywood Young Directors: తెలుగు సినిమాకి చెందిన కొంతమంది ప్రతిభావంతులైన యువ దర్శకులు ఇప్పుడు సీనియర్ హీరోల వైపు మొగ్గు చూపుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడుతున్నట్టు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు బాబి గురించి. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు ఈ డైరెక్టర్. ఇక ఆ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు కెఎస్ బాబీ ఇప్పుడు బాలకృష్ణ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఈ దర్శకుడు వెంకటేష్‌తో వెంకీ మామ చిత్రాన్ని రూపొందించి, రవితేజ కి పవర్ లాంటి సినిమా అందించిన సంగతి తెలిసిందే. ఇలా ఎక్కువగా సీనియర్ హీరోల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాబి.
మరోవైపు ప్రస్తుతం, దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య యొక్క భగవంత్ కేసరిని రూపొందిస్తున్నాడు. ఇక ఈ దర్శకుడి తదుపరి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపిస్తాడని నివేదికలు వెలువడ్డాయి. ఈ రెండు సినిమాలకు ముందు అనిల్ వెంకటేష్‌తో ఎఫ్2, రవితేజతో రాజా ది గ్రేట్ చిత్రాలను అందించాడు.
ఇక వీళ్ళిద్దరి అడుగుజాడలనే ఫాలో అవుతున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ తో సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ కూడా మెగాస్టార్ చిరుతో ఓ సినిమాకు సైన్ చేస్తే.. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోలతో సినిమాలు తీసిన దర్శకుల గ్యాంగ్‌లో చేరిపోతారు. ఈ దర్శకుడు గతంలో వెంకీతో బాడీగార్డ్, రవితేజతో చాలా సినిమాలు, ఇటీవలే బాలయ్య తో వీర సింహారెడ్డి సినిమాలు తీశారు.
ఇలా మొత్తం మీద ఈ ముగ్గురు యువ దర్శకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ లాంటి సీనియర్ హీరోలపైనే మొగ్గు చూపడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.