Sai Dharam Tej: 2021 సెప్టెంబర్ 10న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ సాయి ధరమ్ తేజ్ ని కాపాడారు. సకాలంలో వైద్యం అందేలా చేశాడు. గోల్డెన్ హౌర్ లో సాయి ధరమ్ స్థానిక ఆసుపత్రికి చేరారు. నెల రోజుల పాటు కోమాలోనే ఉన్న సాయి ధరమ్ కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. ప్రమాదం అనంతరం ఆయన నటించిన చిత్రం విరూపాక్ష విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో తనను కాపాడిన సయ్యద్ అబ్దుల్ గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.
నాకు ప్రాణదానం చేసిన వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేను. అందుకే అతన్ని కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చాను. తనకు ఎలాంటి కష్టం వచ్చినా మొహమాటం లేకుండా ఫోన్ చేయమని చెప్పాను, అని అన్నారు. ఈ క్రమంలో మీడియా అతన్ని సంప్రదించింది. సయ్యద్ అబ్దుల్ మాటలు విన్నాక అందరూ షాక్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు ఆ ఫ్యామిలీ నుండి ఎవరూ తనని కలవలేదని సయ్యద్ అబ్దుల్ చెప్పారు. పైగా మీడియాలో జరిగిన ప్రచారం తనకు సమస్యలు తెచ్చిపెట్టిందన్నాడు.
నాకు సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇది నిజమే అని నమ్మిన నా తోటి ఉద్యోగులు జాక్ పాట్ కొట్టేశావని వేధింపులకు గురి చేశారు. దాంతో సిఎమ్మార్ షాపింగ్ మాల్ లో ఉద్యోగం మానేశాను. నాలుగు నెలలు పని లేక ఇబ్బందులు పడ్డాను. మా బంధువులు కూడా ఫోన్లు చేసి నీకు లక్షల రూపాయలు ఇచ్చారట కదా అని అడిగేవారు. లేదని చెప్పినా నమ్మేవారు కాదు.
సాయి ధరమ్ తేజ్ నన్ను కలవలేదు. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గరలేదు. ఒకవేళ ఆయన ఫోన్ చేసి రమ్మంటే కలుస్తాను. ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు, మీడియా ఫోన్లు చేసి సమాచారం అడిగారు. మొత్తంగా జరిగింది ఇదే అన్నారు. ఇక విరూపాక్ష చిత్రం చూశాను. చాలా బాగుందని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఘటనలో అబద్దం చెబుతుంది ఎవరు? అనే సందేహం మొదలైంది.