Hero Surya: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన హీరోగా నటించిన చిత్రాలన్నీ ఓటీటీలోనే విడుదలయ్యాయి. గతేడాది ఆకాశమే నీహద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మంచి హిట్ అందుకున్నారు సూర్య. ఆ సినిమాలు థియేటర్లో విడుదలయ్యింటే బాగుండేదని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. తాజాగా సూర్య హీరోగా వస్తోన్న సినిమా ఈటీ. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు ప్రధాన భాషల్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు.

సన్ పిక్షర్స్ పతాకంపై కళానిధఇ మారన్ నిర్మిస్తోన్న ఈటీ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య కూడా నటించారు. దీంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. ఈటీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుంగా.. ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరుకు సూర్య రూపంలో పెద్ద చిక్కొచ్చిపడినట్లుంది. అదే రోజు చిరు నటించిన ఆచార్య సినిమాకూడా విడుదల కానుంది దీంతో రెండు సినిమాలు బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆచార్యకు ఉన్న క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో సూర్య ఈటీకి థియేటర్ల సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.మరి ఏ సినిమా ఘన విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.