రీమేక్ లు ఇవాళ సర్వసాధారణం అయిపోయాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ వీటి హవా కొనసాగుతోంది. అయితే.. తెలుగులో టాప్ స్టార్లుగా ఉన్నవారు కూడా రీమేక్ ల వెంట పడడంపై పెదవి విరుస్తున్నారు సగటు సినీ ప్రేక్షకులు. ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే కెపాసిటీ ఉంచుకొని.. పరాయి భాషల కథలను అరువు తెచ్చుకోవడం ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: మెగాస్టార్ స్థాయి అతడికి మాత్రమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన శర్వా!
మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో. అలాంటి స్టార్ కూడా వరుసగా రీమేకులు చేస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు.. 150వ సినిమాగా రీమేక్ నే ఎంచుకున్నారు. తమిళ్‌లో హిట్ గా నిలిచిన కత్తికి మెరుగులు దిద్ది ‘ఖైదీ నెంబ150’గా ముందుకు వచ్చారు. సరే.. పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి.. సేఫ్ జోన్లో సెలక్ట్ చేసుకున్నారని భావించొచ్చు.
కానీ.. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాల్లో రెండు రీమేకులే కావడం విశేషం. అందులో ఒకటి ‘లూసీఫర్’ రీమేక్ కాగా.. మరొకటి ‘వేదాళం’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య తర్వాత ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించనున్నాడు మెగాస్టార్. ఇలాంటి స్టార్ రీమేకులు ఎంచుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇక, ఆ తర్వాత వెంకటేష్. చాలా మందికి తెలియదుగానీ.. వెంకీ సినిమాల్లో మెజారిటీవి రీమేకులే. ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా.. ఎక్కడ హిట్ సినిమా కనిపించినా.. రీమేక్ చేస్తుంటాడు వెంకీ. టాలీవుడ్ లో వెంకటేష్ పాపులారిటీ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిందే. ఆ నలుగురు సీనియర్లలో ఆయన ఒకరు. అలాంటి వెంకీ కూడా స్ట్రయిట్ చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించరు. త్వరలో దృశ్యం-2 కూడా రీమేక్ గా రాబోతోంది.
Also Read: కోట్లు మోసపోయాను..వాళ్లే ముంచారు: రాజేంద్రప్రసాద్
రీమేక్ లపై మోజుపడే మరో హీరో పవన్ కల్యాణ్. ఆయన సినిమాల్లో దాదాపు సగానికిపైగా రీమేక్ లే అంటే ఆశ్చర్యం కలగక మానదు. మొదటి సినిమా నుంచి మొన్నటి అజ్ఞాతవాసి వరకు దాదాపు 80 శాతం సినిమాలు పరాయి భాషల నుంచి వచ్చినవే. ఇప్పుడు రీఎంట్రీలో తెరకెక్కిస్తున్న సినిమాల్లోనూ రెండు రీమేకులే ఉన్నాయి. అందులో అయ్యప్పనుమ్ కోషియం ఒకటికాగా.. వకీల్ సాబ్ మరొకటి. తెలుగులో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ ఇంట్రో అవసరమే లేదు. అంతటి స్టార్ కూడా రీమేకులను ఆశ్రయిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ.. ఇలా రీమేకులు తీయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తెరకెక్కుతూ.. స్ట్రయిట్ గా ఇతర భాషల సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ రోజుల్లోనూ ఈ పంథా సరికాదని అంటున్నారు సగటు సినీ అభిమానులు. ఇకనైనా వారు స్ట్రయిట్ కథలు ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. మరి, మన స్టార్లు ఏమంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్