Singeetam Srinivasa Rao: మన టాలీవుడ్ లో లవ్ స్టోరీలు, రివెంజ్ డ్రామాలు, మాస్ కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో, ప్రేక్షకులకు కాస్త సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో సింగీతం శ్రీనివాస్ ఆరోజుల్లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పుడంతే ఇండస్ట్రీ మార్కెట్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది కాబట్టి,భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఆరోజుల్లోనే ‘ఆదిత్య 369’ భారీ బడ్జెట్ సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి, ప్రేక్షకులను నివ్వెరపోయేలా చేశాడు. మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఆయన. గత కొంత కాలం గా సినిమాలకు బాగా దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్ళు. ఈ వయస్సులో ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించనుంది. ‘కల్కి 2898 AD’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ, ఇప్పుడు సింగీతం దర్శకత్వం లో మరో ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ చిత్రాన్ని నేడు వైజయంతి మూవీస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియో లో సింగీతం ‘సెంచరీలు కొట్టే వయస్సు మాది’ అంటూ ఉల్లాసంగా షూటింగ్ పనులు చేసుకుంటూ కనిపించాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇక ఈ చిత్రం లో హీరో ఎవరు?, మిగిలిన నటీనటులు ఎవరు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇకపోతే నేడు విడుదల చేసిన వీడియో లో సింగీతం శ్రీనివాస్ రావు కి 94 ఏళ్ళ వయస్సు అంటే ఎవ్వరూ నమ్మరేమో. ఈ వయస్సులో కూడా ఆయన గొంతు లో ఎలాంటి బెరుకు లేదు, వణుకు లేదు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఉత్సాహం గా పని చేస్తున్నాడు. చాలా అరుదుగా దేవుడు కొంతమందికే ఇలాంటి శక్తి ఇస్తాడు. సినిమాని ఆయన ఎంత ఉత్సాహంగా పూర్తి చేస్తాడో, ఈ తరం ప్రేక్షకులను కూడా అలరించేలా ఆయన సినిమాలు తీయగలడో లేదో అనేది త్వరలోనే తెలియనుంది. సింగీతం శ్రీనివాస్ చివరిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. 2013 వ సంవత్సరం లో ఈ చిత్రం విడుదలైంది. ఆమధ్య పవన్ కళ్యాణ్ తో యేసు క్రీస్తు నేపథ్యం లో ఒక సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు . కానీ ఎందుకో ఈ చిత్రం కార్య రూపం దాల్చలేదు.