Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలు కాగా నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేటైంది. ఇక రెండో వారం శేఖర్ బాషా ఇంటి బాట పట్టాడు. కంటెస్టెంట్స్ నిర్ణయం ఆధారంగా శేఖర్ బాషాను బయటకు పంపిన సంగతి తెలిసిందే. ఇక మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. నాలుగో వారం సోనియాకు ప్రేక్షకులు గుడ్ బై చెప్పారు.
సోనియా ఎలిమినేషన్ తో హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ తగు కారణాలు చెప్పి ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన సభ్యుల ఫోటోలు దహనం చేయాలని సూచించాడు. వాదోపవాదాల మధ్య నామినేషన్స్ ముగిశాయి. నిఖిల్, విష్ణుప్రియ, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు.
ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అనూహ్యంగా విష్ణుప్రియ ఓటింగ్ లో వెనుకబడిందట. ఆమె మూడో స్థానానికి పరిమితం అయ్యిందట. నామినేట్ అయిన ప్రతిసారి విష్ణుప్రియ ఓటింగ్ లో టాప్ లో ట్రెండ్ అయ్యింది. ఆమెకున్న పాపులారిటీ రీత్యా ఓట్లు బాగా పడేవి. ఐదు వారాల్లో సీన్ మారిపోయింది. విష్ణుప్రియ గేమ్ పట్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి ఏర్పడిన సూచనలు కనిపిస్తున్నాయి.
నిఖిల్, విష్ణుప్రియ వంటి పేరున్న సెలెబ్స్ ని వెనక్కి నెట్టి నబీల్ ఓటింగ్ లో ప్రథమ స్థానంలో ఉన్నాడట. ఇది ఊహించని పరిణామం. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వరకు నబీల్ ఎవరో కూడా తెలియదు. ఆయనకు సోషల్ మీడియాలో కొద్దో గొప్పో ఫేమ్ ఉంది. తన ఆటతో నబీల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని ఓటింగ్ ట్రెండ్ చూస్తే అర్థం అవుతుంది. ఇక నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడట.
నాగ మణికంఠ నాలుగవ స్థానంలో కొనసాగుతుండగా చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, నైనిక ఉన్నారట. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదంటున్నారు. కాగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ వారం ఇంటిని వీడేది ఎవరు? కొత్తగా వచ్చేది ఎవరో? చూడాలి.