
దిగ్గజ దర్శకుడు శంకర్ ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో కొత్త తరహా అపరిచితుడిని చూపిస్తానని చెప్పారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతి లాల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.
అయితే.. శంకర్ ప్రకటించిన మర్నాడే అపరిచితుడు ఒరిజినల్ వెర్షన్ నిర్మాత రవిచంద్రన్ స్పందించారు. ఆ కథపై పూర్తి హక్కులు తనవేనని, తనకు తెలియకుండా కథను వాడుకోవద్దంటూ హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. దీనిపై శంకర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపించబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమా కథను రైటర్ సుజాత రాశారని, ఆ కథ మొత్తం హక్కులు తమవేనని రవిచంద్రన్ లేఖలో పేర్కొన్నారు. దీనిపై శంకర్ స్పందిస్తూ.. సుజాత కేవలం డైలాగ్స్ మాత్రమే రాశారని చెప్పారు. ఆ కథ పూర్తిగా తనదేనని చెప్పారు. ఈ సినిమాలో ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వారికి దక్కిందని, కథ, ఇతర పాత్రల విషయంలో ఎవ్వరికీ సంబంధం లేదని అన్నారు.
అపరిచితుడు ఆధారంగా ఎలాంటి సినిమాలను తీసుకునే హక్కైనా తనకు ఉందని, ఈ విషయంలో అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని అన్నారు. దీంతో.. ఈ వివాదం మరోస్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది. శంకర్ సమాధానంపై రవిచంద్రన్ ఎలా స్పందిస్తారు అనేదానిపై వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలుస్తుంది.