Samantha: సమంత మరలా చర్మ వ్యాధి బారిన పడినట్లు సమాచారం అందుతుంది. ఆమె చికిత్స కోసం త్వరలో అమెరికా వెళ్లనున్నారనేది టాలీవుడ్ హాట్ టాపిక్. కెరీర్ బిగినింగ్ లో సమంత అరుదైన చర్మ వ్యాధి బారిన పడ్డారు. PLE(పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్) అనే ఈ వ్యాధి కారణంగా ఆమె కొన్నాళ్ళు షూటింగ్స్ కి దూరమయ్యారు. ఈ వ్యాధి సోకితే సూర్య కాంతిని చర్మం తట్టుకోలేదు. ఆ కిరణాలు శరీరాన్ని తాకిన వెంటనే దురద, దద్దుర్లు ఏర్పడతాయి. అప్పట్లో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ఆ సమస్య నుండి బయటపడ్డారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు.

అయితే ఆమెకు మరలా ఈ వ్యాధి తిరగబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికా వెళ్లనున్నారట. ఖుషి చిత్ర షూటింగ్ లో కూడా సమంత పాల్గొనడం లేదట. సమంత కారణంగా ఖుషి షూటింగ్ డిలే అవుతుంది అంటున్నారు. ఇటీవల సమంత చర్మ వ్యాధితో బాధపడుతున్నారనే వార్తలను ఆమె టీమ్ ఖండించారు. అయితే ఆమె ఆకస్మిక అమెరికా ప్రయాణం అందుకోసమే అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక తారలకు ఇలాంటి వ్యాధులు కామన్. బిజీ షెడ్యూల్స్ కారణంగా టైం కి తినడం, పడుకోవడం ఉండదు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ అనేక రకాల వాతావరణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టార్స్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మరోవైపు సమంత హెల్త్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఆమె తాజా ఆహారం మాత్రమే తీసుకుంటారు. కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఇంట్లో స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. వాటినే తింటారు. ఇక యోగాసనాలు, వ్యాయామం ఆమె దిన చర్యలో భాగంగా ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం సమంత హీరోయిన్ గా మూడు తెలుగు చిత్రాలు రూపొందుతున్నాయి. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరో చిత్రం యశోద సైతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యశోద సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా ఇటీవల టీజర్ విడుదల చేశారు. శాకుంతలం, యశోద పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల చేయనున్నారు. అలాగే విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి చిత్రం చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ పెట్టేస్తున్నారు.