రవితేజ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడని ప్రస్తుతం మాస్ రాజా చేతిలో నాలుగు సినిమాలున్నాయని తెలిసిందే. ఈ క్రమంలో తన 68వ సినిమాకి ఈ రోజే కొబ్బరి కాయ కొట్టి కొత్త పోస్టర్ ను కూడా వదిలారు. పైగా ఈ సినిమా కోసం రవితేజ కొత్త దర్శకుడితో పనిచేయబోతున్నాడు. శరత్ మాండవ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ మాస్ రాజాకు విపరీతంగా నచ్చింది. అందుకే ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఆ మధ్య పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది.
కానీ ఆ తర్వాత ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది. ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ సినిమాకు ఎమ్మార్వో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కాకపోతే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్’గా ‘దివ్యాన్ష కౌశిక్’ నటిస్తోంది. ఈ అమ్మడు నాగ చైతన్య ‘మజిలీ’ సినిమాతో పరిచయమైనా వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ కూడా వేసారు.
ప్రస్తుతం ఈ సెట్ లోనే షూట్ చేస్తున్నారు. అయితే ఈ మొదటి షెడ్యూల్ లో రవితేజ – వెన్నెల కిషోర్ పై కొన్ని ముఖ్యమైన సీన్స్ ను తీయనున్నారు. రవితేజ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడట. అన్నట్టు ఈ సినిమాలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతోంది.