
దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న భారీ చిత్రం RRR. ఈ మూవీని నిర్మిస్తున్నది డీవీవీ దానయ్య. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు అనేది చర్చల్లో ఉన్న మాట. వాస్తవ బడ్జెట్ ఎంత అనేది దర్శక నిర్మాతలకు మాత్రమే తెలుస్తుంది. అయితే.. ఖచ్చితంగా 350 కోట్ల పైనే ఉంటుందనేది అంచనా.
అయితే.. ఇంత మొత్తం లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గరా ఉండవు. అందుకే.. ఫైనాన్స్ తెచ్చి బండి నడిపిస్తుంటారు. అన్ని సినిమాలూ ఇదే పద్ధతిలో తెరకెక్కుతుంటాయి. అడ్వాన్సుల ద్వారా, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన డబ్బు ద్వారా రిలీజ్ కు ముందే ఫైనాన్స్ క్లియర్ చేస్తుంటారు.
అయితే.. RRR సినిమాకు దాదాపుగా 200 కోట్ల మేర ఫైనాన్స్ తెచ్చినట్టు సమాచారం. ఇందులో వంద కోట్ల మేర రెండు రూపాయల్లోపు వడ్డీ ఉండగా.. మరో వంద కోట్ల మేర రూపాయిన్నర వడ్డీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఎంతకీ పూర్తికాకపోవడం నిర్మాతకు భారంగా మారింది.
ఇప్పటికే మూడు సార్లు రిలీజు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. కరోనా రెండు సార్లు షూటింగులు ఆపేసింది. సినిమా ఆగినంత మాత్రాన వడ్డీ అగుతుందా? అది కొండలా పెరిగిపోతూనే ఉంది. ఇక, బాలీవుడ్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ లో భాగంగా అడ్వాన్సు కట్టిన వారికి చెప్పిన సమయానికి సినిమా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే.. ఆ నెక్స్ డే నుంచే.. వాళ్లు కూడా వడ్డీ వసూలు చేస్తారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో? ఎప్పుడు రిలీజ్ అవుతుందో దర్శక, నిర్మాతలకు కూడా తెలియని పరిస్థితి. అప్పటి వరకు వడ్డీలు పెరుగుతూ పోతూనే ఉంటాయి. ఈ మొత్తాన్ని లెక్కేస్తే.. వడ్డీ కింద కనీసం వంద కోట్లు చెల్లించాల్సి ఉంటుందట! అంటే.. సినిమా బడ్జెట్ 500 కోట్లు అనేసుకోవచ్చన్నమాట. ఇంత మొత్తం వసూలు కావాలంటే.. RRR ఏ రేంజ్ లో హిట్ కొట్టాల్సి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.