Roja Unstoppable: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ షోలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. కూతురు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కన్న తండ్రి ఎన్టీఆర్ ని తప్పు చేసినట్లు చిత్రీకరించిన బాలయ్య అన్ స్టాపబుల్ షోకి వెళ్ళేది లేదని తేల్చి చెప్పారు. గతంలో నాకు అన్ స్టాపబుల్ షోలో పాల్గొనాలని పిలుపు వచ్చింది. ఆ సమయంలో అసెంబ్లీలో ఇరు పార్టీల మధ్య గందరగోళం నెలకొంది. ఆ సమయంలో నేను బాలయ్య షోలో పాల్గొంటే జనాల్లో తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే రాలేనని చెప్పాను.

చంద్రబాబు ఎపిసోడ్ చూశాక అసలు వెళ్లకూదని నిర్ణయించుకున్నాను. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అంటే గౌరవం ఉంటుంది. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితం ఇచ్చి, ఆస్తులు పంచి ఇస్తే… ఆయన్నే తప్పు చేశాడని నిరూపించాడు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న చంద్రబాబు కడిగిన ముత్యం అని బాలయ్య నిరూపించే ప్రయత్నం చేశాడు. అలాంటి టాక్ షోకి వెళ్లడం నాకు నచ్చలేదు.
బాలకృష్ణతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి పని చేశాము. అయినప్పటికీ ఆ షోకి నేను వెళ్ళను. తన కూతురు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బాలకృష్ణ కన్న తండ్రికి అన్యాయం చేశాడు. బాబు మంచి వాడు అని నిరూపించడానికి ఎన్టీఆర్ ని చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఆమె వాపోయారు. కాగా రోజా రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీలోనే. 2009 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ లో చేరారు. టీడీపీలో నాకు గౌరవం ఇవ్వలేదు, అందుకే అక్కడ ఉండలేకపోయానంటూ రోజా ఆరోపణలు చేశారు.

కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడిని గెస్ట్ గా పిలిచారు. అలాగే అల్లుడు నారా లోకేష్ సైతం వారితో జాయిన్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో 1995 ఆగస్టు సంక్షోభం చర్చకు వచ్చింది. ఎన్టీఆర్ ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడానన్న నారా చంద్రబాబు నాయుడు.. నా నిర్ణయం తప్పా అని బాలయ్యను అడిగారు. అవును ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉందని బాలకృష్ణ సమాధానం చెప్పారు. వెన్నుపోటు పర్వంగా ప్రత్యర్థులు విమర్శించే ఆ సంఘటనకు వివరణ ఇవ్వాలని బాబు ప్రయత్నం చేశారు. మొత్తంగా ఎన్టీఆర్ నిర్ణయాలు, పాలన పెడదోవ పడుతున్న తరుణంలో ఆయన్ని పదవి నుండి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు బాబు పరోక్షంగా తెలియజేశారు.