RK Selvamani : ఇటీవల ఆర్ కే సెల్వమణి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ది ఫిలిం ఎంప్లాయ్స్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(FEFSI) హెడ్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ చిత్రాల షూటింగ్స్ తమిళనాడులోనే జరగాలి. అలాగే తమిళ చిత్రాల్లో తమిళ నటులను మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళ చిత్రాలు షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతున్నారు. దీన్ని ఆయన వ్యతిరేకించారు. హైదరాబాద్, వైజాగ్, గోదావరి జిల్లాల్లో తమిళ చిత్రాల షూటింగ్స్ చేయడం వలన తమిళ పరిశ్రమ మీద ఆధారపడిన నటులు, సాంకేతిక నిపుణులు నష్టపోతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కోలీవుడ్ బడా స్టార్స్ ని కలిసి చర్చించినట్లు ఆయన అన్నారు. ఆర్కే సెల్వమణి కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. బ్రో ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం మీద స్పందించారు. తమిళ పరిశ్రమలో తమిళ వాళ్లే పని చేయాలి, తమిళ నటులే, సాంకేతిక నిపుణులే పని చేయాలంటే పరిశ్రమ ఎదగదు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిందంటే టాలెంట్ ఎక్కడ ఉన్నా.. తీసుకుని ఎంకరేజ్ చేయడమే అన్నారు.
భాషాభిమానం ఉండొచ్చు కానీ ఇలాంటి సంకుచిత స్వభావం ఉండకూడదు. తెలుగు పరిశ్రమ అందరినీ ఆహ్వానిస్తుంది. తమిళ పరిశ్రమలో మాత్రం ఇలా ఆంక్షలు విధిస్తున్నారని ఓపెన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు నాజర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ని ఎవరో తప్పుదోవ పట్టించారు. ఆర్కే సెల్వమణి ఉద్దేశం వేరు. తమిళ పరిశ్రమను నమ్ముకుని వేల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాల కోసమే సెల్వమణి మాట్లాడారు అన్నారు.
కాగా సెల్వమణి మరో నిబంధన తెరపైకి తెచ్చారు. తమిళ చిత్రాలకు తమిళ టైటిల్స్ మాత్రమే ఉండాలని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ వాడకం ఎక్కువైపోయింది. దీన్ని అడ్డుకోవాలి. తమిళ సంస్కృతి, భాషను అభివృద్ధి చేసేలా టైటిల్స్ ఉండాలి. తమిళ టైటిల్స్ వాడిన చిత్రాలకు సబ్సిడీ ఇవ్వాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలినట్లు ఆయన వెల్లడించారు.